సికింద్రాబాద్ వస్తున్న రైలులో బాలికపై లైంగికదాడి.. వీడియో చిత్రీకరణ
సంబల్పూర్ నుంచి కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వస్తున్న బాలిక
కాలకృత్యాలు
తీర్చుకునేందుకు వెళ్లిన బాలికపై నిందితుడి అఘాయిత్యం
139 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి
రైలు సికింద్రాబాద్ చేరుకున్న వెంటనే నిందితుడి అరెస్ట్
కుటుంబంతో కలిసి సంబల్పూర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఓ బాలికపై రక్సౌల్ ఎక్స్‌ప్రెస్‌లో లైంగిక దాడి జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు ఆ ఘటనను వీడియో తీశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి కథనం ప్రకారం.. సంబల్పూర్కు చెందిన కుటుంబం రక్సౌల్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ బయలుదేరింది. వారు ప్రయాణిస్తున్న కోచ్‌లోనే బీహార్‌లోని మంద్వాడ్ జిల్లా ఖజోలి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ (21) ప్రయాణిస్తున్నాడు.
రైలు కేల్తార్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండగా కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాలిక టాయిలెట్లోకి వెళ్లింది. ఆమెపై కన్నేసిన సంతోష్ కుమార్ కూడా వెంటే వెళ్లాడు. బాలికను బలవంతంగా టాయిలెట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఈ ఘటనను తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఫొటోలు కూడా తీశాడు. తెల్లవారిన తర్వాత బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తండ్రి వెంటనే 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. రైలు సికింద్రాబాద్ చేరుకున్న వెంటనే అప్పటికే కాపు కాసిన రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, ఘటన ఇటార్సీ రైల్వే స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపారు.
