
ఇక ఖాతాకు నలుగురు నామినీలు.. ‘బ్యాంకింగ్’ బిల్లుకు ఆమోదం.
ఇప్పటివరకు ఒక బ్యాంకు ఖాతాకు ఒకరే నామినీగా ఉండేవారు. ఇక నుంచి మనం గరిష్ఠంగా నలుగురిని నామినీలుగా పెట్టుకోవచ్చు. ఇదే రూల్ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)కు కూడా వర్తిస్తుంది.
ఈమేరకు ప్రతిపాదనలతో కూడిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024పై పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఇవాళ రాజ్యసభలో ఈ బిల్లుకు మెజారిటీ ఓట్లు లభించాయి. అంతకుముందు 2024 డిసెంబరులో ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. లాకర్ల విషయానికి వస్తే.. వాటికి పాత పద్ధతిలోనే ఒకరికి మించి నామినీలను పెట్టుకోవచ్చు. అయితే వారికి ప్రయారిటీని నిర్ణయించుకోవాలి.
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024లోని కీలక అంశాలివీ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరిధిలోని బ్యాంకులు ఇప్పటివరకు ప్రతీ రెండో శుక్రవారం, నాలుగో శుక్రవారంలలో ఆర్‌బీఐకు రిపోర్టింగ్ చేసేవి. అవి ఇక నుంచి ప్రతినెలా 15న, 30న రిపోర్టింగ్ చేయాలి.
ప్రభుత్వం వద్ద నమోదైన కంపెనీలలోని డైరెక్టర్ల కనీస వాటా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచారు. డైరెక్టర్ హోదాలో ఉన్నవారు కంపెనీలోని 10 శాతం ఈక్విటీని కలిగి ఉండొచ్చు.
సహకార బ్యాంకుల డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఎనిమిదేళ్ల నుంచి పదేళ్లకు పెంచారు.
కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరుగా(Bank Account Nominees) ఉండేవారు, రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులోనూ సభ్యుడిగా వ్యవహరించొచ్చు.
ఆడిటర్లకు వేతనాల చెల్లింపులో బ్యాంకులకు స్వేచ్ఛను కల్పించే నిబంధన సైతం సవరించిన చట్టంలో ఉంది.
రుణాల ఎగవేతదారులపై నిర్మల కీలక వ్యాఖ్యలు..
ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల అప్పులను ఎగ్గొట్టే వాళ్లను వదిలేది లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. వాళ్ల నుంచి అప్పులను వసూలు చేసేందుకు బ్యాంకులు తగిన చర్యలు చేపడతాయని స్పష్టం చేశారు. బ్యాంకుల అప్పులను ‘రైట్ ఆఫ్’ చేయడం అంటే మాఫీ చేసినట్టు కాదన్నారు. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు-2024పై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ నిర్మల ఈ వివరాలను వెల్లడించారు.