
అసెంబ్లీ నుంచి వైసీపీ డ్రాప్ అవుట్… బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల సెటైర్
ప్రజా జీవితం నుంచి ఆ పార్టీ నేతలు శాశ్వతంగా డ్రాప్ అవుట్ అవుతారని జోస్యం
స్కూళ్లలో విద్యార్థులు, పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అంటూ వ్యాఖ్య
అప్పులతో పాటు చెత్తనూ వారసత్వంగా
ఇచ్చిందంటూ గత ప్రభుత్వంపై మండిపాటు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ డ్రాప్ అవుట్ అయిందని, ప్రజా జీవితం నుంచి ఆ పార్టీ నేతలు డ్రాప్ అవుట్ అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో సెటైర్ వేశారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా స్కూళ్లలో విద్యార్థుల డ్రాప్ అవుట్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వ పాలనలో విద్యార్థులు మాత్రమే కాదు రాష్ట్రంలో ఇంకా చాలా డ్రాప్ అవుట్లు జరిగాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. జగన్ సర్కారు నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోయిన పద్ధతిని, అభివృద్ధిలో తిరోగమనాన్ని సభలో వివరించారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో కూటమి సర్కారు చేపట్టిన కార్యక్రమాలను సభ్యులకు తెలిపారు.
అనేక రంగాల్లో డ్రాప్ అవుట్స్..
ఏపీ నుంచి పరిశ్రమలు డ్రాప్ అవుట్, రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్ అవుట్, పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్, ఎన్నికల్లో ఓటమితో సభలో నుంచి వైసీపీ నేతలు డ్రాప్ అవుట్ అయ్యారని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.
బడ్జెట్ ప్రసంగం చదువుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పేర్లను పయ్యావుల ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో పలు సందర్భాలలో వారు చేసిన వ్యాఖ్యలను, చేస్తున్న పనులను ఈ సందర్భంగా సభకు తెలియజేశారు.
చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లింది..
గత ప్రభుత్వం భారీ మొత్తంలో అప్పులతో పాటు పెద్ద మొత్తంలో చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లిందంటూ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యంగ్యం ప్రదర్శించారు. చెత్త పన్నుకు సంబంధించి గతంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. చెత్తపై పన్ను వేసి ప్రజలపై భారం పెంచిన గత ప్రభుత్వం.. 83 లక్షల టన్నుల చెత్తను తొలగించకుండానే వెళ్లిపోయిందని మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించారు.