
బడ్జెట్‌పై మంత్రి నారా లోకేశ్ హర్షం
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అనేది విప్లవాత్మకమైన నిర్ణయమని ప్రశంస
ఇచ్చిన మాట ప్రకారం ‘తల్లికి వందనం’ పథకానికి నిధుల కేటాయింపు అన్న లోకేశ్
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3.22 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌పై తాజాగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారికి వెన్నుదన్నుగా బడ్జెట్ రూపొందిందని అన్నారు. ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోందని ప్రశంసించారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించడం విప్లవాత్మకమైన నిర్ణయమని కొనియాడారు. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమేగాక ఉపాధ్యాయులు, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గిస్తుందన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ‘తల్లికి వందనం’ పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించడానికి బడ్జెట్ లో నిధులు (రూ.9,407 కోట్లు) కేటాయించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో 1 నుంచి 12వ తరగతివరకు చదువుకునే ప్రతి విద్యార్థికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఈసారి బడ్జెట్ లో పాఠశాల విద్యకు రూ. 31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 2,506 కోట్లు వెరసి రూ. 34,311 కోట్లు (గత ఏడాది కంటే రూ. 2,076 కోట్లు అధికం) కేటాయించడం ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో తమ చిత్తశుద్ధికి అద్దం పడుతోందన్నారు.
రానున్న ఐదేళ్లలో ఏపీ మోడల్ విద్యావ్యవస్థను తీసుకురావాలన్న తన సంకల్పానికి బడ్జెట్ లో తాజాగా కేటాయించిన నిధులు దన్నుగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. దీంతో ఏపీ యువత అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.