
ఆ స్థలానికి పెరిగిన డిమాండ్ – మట్టిలో సమరయోధుల స్మారకాలు –
దేశ రాజధానిలో ఎన్‌జీ రంగా స్మారకం విధ్వంసం – సమరయోధుల కృషితో ఏర్పాటైన కాలనీలోనే ఘోర అవమానం
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, దశాబ్దాలపాటు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన తెలుగు దిగ్గజ నేత ఎన్‌జీ రంగా (Acharya Gogineni Ranga Nayukulu), బాపట్లకు చెందిన మరో యోధుడు యూఎల్ సుందర్‌రావుల స్మారకాలు దేశ రాజధానిలో మట్టిలో కలిపేస్తున్నారు. వారి కృషితో ఏర్పడ్డ కాలనీలోనే ఆ మహానేతల ఆనవాళ్లును చెరిపేస్తున్నారు. ఎవరైతే సమరయోధుల గౌరవార్థం స్మృతి చిహ్నాలను నిర్మించారో వారి వారసులే ఆ స్థలంపై కన్నేసి ఆక్రమణకు దారి తీస్తున్నారు. ఎన్‌జీ రంగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు స్వాతంత్య్ర సమరయోధులకు దిల్లీలో ఒక చిరునామా ఉండాలని ఫ్రీడమ్ ఫైటర్స్ కల్చరల్ సొసైటీని స్థాపించారు.
ఉద్యమ సహచరుడు బాలక్‌రామ్, ఆయన కుమారుడు రతీరామ్‌లకు చెందిన 42.5 ఎకరాల భూమిని సొసైటీ ద్వారా కొని అందులో కాలనీ ఏర్పాటు చేశారు. సొసైటీ అధ్యక్షుడిగా ఎన్‌జీ రంగా, ప్రధాన కార్యదర్శిగా యూఎల్ సుందర్‌రావులు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో మాట్లాడి వసతులూ కల్పించారు. కాలనీపై ఎంతో మమకారం పెంచుకున్న ఎన్‌జీ రంగా తన స్మారకం అందులో ఉండాలనుని అకున్నారు. బాలక్‌రామ్, రతీరామ్‌లు కూడా మన నేతల గొప్పతనాన్ని గుర్తించి ఇద్దరి స్మారకాలను కాలనీలో నిర్మించి గౌరవించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్‌జీ రంగా అస్థికలను తీసుకెళ్లారు. ఇంత చేస్తే ఆ యోధుల కృషిని బాలక్‌రామ్, రతీరామ్‌ల వారసులు విస్మరించారు
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాలి: స్మృతి చిహ్నాలు ఉన్న స్థలానికి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. వాటి పక్కనే ఉన్న భవనాన్ని రతీరామ్ కుమారుడు విజయ్‌దీప్ ఇటీవల జిమ్ కోసం అద్దెకు ఇచ్చారు. ఆ జిమ్ ముందు వైపు దారి మెట్రోరైల్ నిర్మాణ పనుల వల్ల మూతపడింది. దీంతో వెనుక నుంచి అంటే స్మారకాల పైనుంచి దారి వేసుకోవాలని వ్యాయామశాల నిర్వాహకులకు సూచించారు. అలా చేయడంతో అక్కడున్న ఎన్‌జీ రంగా, సుందర్‌రావుల సమాధులు మట్టిలో కూరుకుపోయాయి.
రోజులు గడిస్తే అవి పూర్తిగా కనుమరుగై అక్కడో దారి స్థిరపడేలా ఉంది. ఆ స్థలానికి విపరీతమైన డిమాండు ఉండటంతో కావాలనే ఇలా చేస్తున్నారని కాలనీలో ఉంటున్న జీవీ రావు తెలిపారు. దీనిపై ఏపీ, తెలంగాణ సీఎంలు స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, స్మారకాలను కాపాడుకోవాలని కోరారు. ఆ యోధుల సమాధులు కాపాడాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉందని మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ పేర్కొన్నారు.