
జనసేన పార్టీ పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా బన్నీ వాసు!
మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాలు
ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసుకు కీలక బాధ్యతలు
బన్నీ వాసు నేతృత్వంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మార్చి 14న జరగనున్న విషయం విదితమే. ఈ మేరకు పార్టీ ముహూర్తం కూడా ఖరారు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో దీనిని అత్యంత వైభవంగా నిర్వహించాలని పార్టీ భావిస్తోంది.
ఈ క్రమంలో ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసుకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయనకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. బన్నీ వాసును పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సభకు సంబంధించిన నిర్వహణ మొత్తం బన్నీ వాసు నేతృత్వంలో జరగనున్నట్లు తెలుస్తోంది. బన్నీ వాసు గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పబ్లిసిటీ కోఆర్డినేషన్ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
సినిమా నిర్మాణంలో బన్నీ వాసు నైపుణ్యాన్ని, సంస్థాగత నైపుణ్యాన్ని జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుక విజయవంతానికి ఉపయోగించనున్నారని జన సైనికులు భావిస్తున్నారు. ఈ కీలక నియామకంతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.