ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభం అయిన ఎన్‌కౌంటర్‌లో ముందుగా నలుగురు చనిపోగా..
ఆ తరువాత మృతుల సంఖ్య 12కు పెరిగింది. ఈ రోజు ఉదయం వరకు మొత్తంగా 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దు బీజాపూర్‌లోని మరూర్ బాకా, పూజారి కంకేర్ ప్రాంతంలో మావోయిస్టులకి, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది నక్సలైట్ల మృతి చెందినట్లుగా భద్రత బలగాలు స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుండి ఎస్ఎల్ఆర్, బీజీసీ, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్‌కౌంటర్‌లో పాల్గొనేందుకోసం బీజాపూర్, సుకమా, దంతేవాడ జిల్లా నుంచి కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపుగా వెయ్యి మంది వరకు తరలి వెళ్లినట్లుగా తెలుస్తుంది. మావోయిస్టులు సమావేశం అవుతున్న సమాచారం మేరకు ఈ భద్రత బలగాలు అక్కడికి వెళ్లి కాల్పులు జరిపారు. సమావేశం అనంతరం మావోయిస్టులు అడవిలోకి వెళుతుండగా.. వారి వెంటపడి చంపినట్లుగా తెలుస్తోంది. భారీగా తరలి వచ్చిన భద్రత బలగాలు మావోయిస్టులను ఎవరినీ వదిలిపెట్టకుండా వెంటపడినట్లు తెలుస్తోంది.
ఈ ఒక్క జనవరిలోనే ఇప్పటివరకు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా భద్రత బలగాలు 9 మంది మందుపాతర పేలుడులో మృతి చెందారు. గత ఏడాది 270 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల చేతిలో మృతి చెందారు. బీజాపూర్ జిల్లా కుట్టు వద్ద ఈ నెల 6న జరిగిన మందు పాతరలో 9 మంది జవానులు మృతి చెందారు. దీంతో అదే ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వరుస ఎన్‌కౌంటర్‌లు బీజాపూర్ జిల్లాలోనే పోలీసులు చేపట్టారు.