Advertisements

సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ స్టార్ట్‌ చేశారా? కేటీఆర్‌కు చెక్ పెట్టేందుకు హరీశ్‌ను వాడుకుంటున్నారా?

సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ స్టార్ట్‌ చేశారా? కేటీఆర్‌కు చెక్ పెట్టేందుకు హరీశ్‌ను వాడుకుంటున్నారా?

ఔటర్‌రింగ్ రోడ్డు లీజ్ టెండర్లు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరిగాయి. అప్పుడు కూడా మున్సిపల్‌ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు.

సీఎం రేవంత్ అన్నంత పని చేస్తున్నారా..? కేటీఆర్ – హరీశ్‌రావు మధ్య చీలికలు తెచ్చే గేమ్ స్టార్ట్ చేశారా.? ఏకంగా హరీశ్‌రావుతోనే కేటీఆర్‌కు చెక్‌ పెట్టే స్కెచ్ వేస్తున్నారా..? అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం.? హరీశ్‌రావు కోరిక మేరకే ORR లీజ్ టెండర్ల విచారణ జరిపిస్తున్నారా.? రేవంత్ వాఖ్యల వెనుక వ్యూహం అదేనంటూ బిగ్‌ గాసిప్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది..

ఏడాది క్రితం వరకు తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అష్టకష్టాలను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు.. వరుస ఎదురుదెబ్బలతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు కేసులు, విచారణలు కూడా విరుచుకుపడుతున్నాయి.

గులాబీ బాస్ కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న కారు స్టీరింగ్‌ను కేటీఆర్‌ తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇంతలో ఈ-కారు రేస్ కేసు స్పీడ్‌ బ్రేకర్‌లా అడ్డొచ్చిపడింది. ఈ-కారు రేసును మించిన వేగంతో కేసు దర్యాప్తు మొదలైంది.. కేటీఆర్‌ను A1గా చేర్చి FIR నమోదు చేసింది ఏసీబీ. మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగి వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ పంపించింది. ఈ పరిణామాలు చూస్తుంటే.. ఏ క్షణంలోనైనా కేటీఆర్‌ అరెస్ట్ కావచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఓవైపు ఈ-కారు రేస్ కేసు రైజింగ్‌లో ఉన్న టైమ్‌లో హఠాత్తుగా ఔటర్‌రింగ్ రోడ్డు లీజు టెండర్ల అంశం తెరపైకి

రావడంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఔటర్ రింగ్ రోడ్డును గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 7వేల కోట్ల రూపాయలకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇది ఎక్కడికీ దారితీస్తోందోనన్న చర్చ జరుగుతోంది.

ORR లీజ్ టెండర్లపై విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి పదే పదే హరీశ్‌రావు పేరును ప్రస్తావించడమే బిగ్‌ డిబేట్‌ పాయింట్‌గా మారింది. హరీశ్‌రావు కోరిక మేరకే ORR టెండర్లపై సిట్ విచారణ జరిపిస్తామని నొక్కి మరీ చెప్పడం వెనుక రేవంత రెడ్డి ఆంతర్యమేంటనే చర్చ పొలిటికల్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.. ఓఆర్ఆర్ లీజుపై అభ్యంతరాలుంటే.. రద్దు చేయండని హరీశ్‌రావు కామెంట్ చేస్తే.. హరీశ్‌రావు కోరిక మేరకు విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చెప్పడంలో ఏదో స్ట్రాటజీ ఉందనే అనుమానాలు బీఆర్‌ఎస్‌ కేడర్‌ను వెంటాడుతున్నాయి.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల్ని రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయట. తెలంగాణలో కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామని.. కేసీఆర్‌ను రాజకీయంగా మర్చిపోయేలా చేస్తామని రేవంత్‌ రెడ్డి చాలాసార్లు అన్నారు. హరీశ్‌రావును వాడుకొనే కేటీఆర్‌కు చెక్ పెడతామని హింట్‌ కూడా ఇచ్చారు.

ఇప్పుడు హరీశ్‌రావు కోరిక మేరకే అని అనడంతో.. అప్పటి రేవంత్ మాటల్ని రివైండ్ చేసుకుంటున్నారట. చెప్పినట్టే.. హరీశ్‌రావును వాడుకొని రేవంత్‌ తన పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారనే చర్చ ఊపందుకుంది. బావ-బావమరుదులకు మధ్య మనస్పర్ధలు సృష్టించే రాజకీయ చదరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టారన్న టాక్ వినిపిస్తోంది.

ఔటర్‌రింగ్ రోడ్డు లీజ్ టెండర్లు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరిగాయి. అప్పుడు కూడా మున్సిపల్‌ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. కాబట్టి ఓఆర్ఆర్ టెండర్ల తీగ లాగితే.. అది మళ్లీ కేటీఆర్‌కే ఉచ్చులా బిగుసుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. మరి రేవంత్ వ్యూహంలో భాగంగా హరీశ్‌రావు-కేటీఆర్ మధ్య చీలిక వస్తుందా..? లేదంటే రేవంత్ ప్లాన్ బెడిసికొడుతుందా.? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Leave a Comment

You May Like This