పట్టణంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయండి
విష జ్వరాల నుండి ప్రజలను కాపాడండి
సీపీఐ, ఆల్ ఇండియా తన్జీమ్ ఏ ఇన్సాఫ్, ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
పురపాలక శాఖ కమిషనర్ కి వినతి
గూడూరు పట్టణంలో గత రెండు వారాలుగా విష జ్వరాలు విపరీతంగా పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని, దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయాలని పురపాలక శాఖ కమిషనర్ కు శనివారం వినతిపత్రం సమర్పించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ, ఇన్సాఫ్ నాయకులు మాట్లాడుతూ పట్టణంలో చికెన్ గున్యా, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి విష జ్వరాలు తీవ్రంగా ప్రబలి ప్రతి ఇంట్లో జ్వరపీడీతులు ప్రబలుతున్నాయన్నారు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. కుక్కల బెడద కూడా తీవ్రంగా ఉందన్నారు. కుక్కలు గుంపులుగా చేరి పాదచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడి చేస్తున్నాయన్నారు. కుక్కల బెడద నుండి పట్టణ ప్రజలను కాపాడాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జనన ధృవీకరణ పత్రాల మంజూరులో జాప్యం వలన బాధితులు అవస్థలు పడుతున్నారన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను కోరారు. అలాగే భూగర్భ గ్యాస్ పైప్ లైన్ కోసం తవ్విన గుంతలను పలు చోట్ల పూడ్చలేదన్నారు. దీంతో వాహనదారులు రాకపోకల సమయంలో అవస్థలు పడుతున్నారన్నారు. పెద్ద మసీదువీధి, సత్రపువీధి, సాధుపేట సెంటర్ తదితర ప్రాంతాల్లో గుంతల వలన నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఆయా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫాగింగ్ మెషీన్లు కొనుగోలు చేశామని, రెండు, మూడు రోజుల్లో పట్టణంలో ఫాగింగ్ చేస్తామన్నారు. కుక్కల బెడదను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
సీహెచ్. ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ ఎంబేటి చంద్రయ్య,
ఆల్ ఇండియా తన్జీమ్ ఏ ఇన్సాఫ్ ఏపీ స్టేట్ డిప్యూటీ సెక్రటరీ షేక్ జమాలుల్లా, నియోజకవర్గ కార్యదర్శి షేక్ ఇలియాజ్ (మున్నా), ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు సతీష్, యశ్వంత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.