ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం… వివరాలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
వివిధ ప్రభుత్వ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం
బియ్యం అక్రమ రవాణా అంశంపై చర్చ
జల్ జీవన్ మిషన్ ఆలస్యం కావడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
అంతేకాదు… పులివెందుల, ఉద్ధానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులను క్యాబినెట్ ఆమోదించింది. హోమియోపతి, ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు కూడా నేటి సమావేశంలో ఆమోదం లభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలు, ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ క్యాబినెట్ భేటీలో బియ్యం అక్రమ రవాణా అంశం కూడా చర్చించారు. ప్రభుత్వానికి ఈ మాఫియా సవాల్ గా మారిందని, దీనికి అడ్డుకట్ట వేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాకినాడ పోర్టులో అరబిందో సంస్థ 41 శాతం వాటాను లాగేసుకుందని ఆరోపించారు. ఆస్తులు గుంజుకోవడం వైసీపీ హయాంలో ట్రెండ్ గా మారిందని వ్యాఖ్యానించారు.
ఇక, కేంద్ర ప్రభుత్వ పథకం జల్ జీవన్ మిషన్ పథకం రాష్ట్రంలో అమలు చేయడంలో ఆలస్యం జరుగుతుండడం పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ వంటి ప్రాధాన్య పథకం ఇంకా డీపీఆర్ స్థాయిని దాటకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, తాగునీటి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ ను ఏపీ సద్వినియోగం చేసుకోవడంలేదని ఢిల్లీలో కూడా చెప్పుకుంటున్నారని వెల్లడించారు.
అధికారుల ఉదాసీనత వల్లే ఈ పథకం ఆలస్యమవుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేశ్ కూడా ఈ పథకంపై స్పందించారు. ఇది అందరికీ చేరువయ్యే భారీ ప్రాజెక్టు అని… దీన్ని మిషన్ మోడ్ లో ముందుకు తీసుకెళ్లడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేశారు.