మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం
తిరుపతి జిల్లా టాస్క్ ఫోర్స్ ప్రధాన అధికారి డాక్టర్ శ్రీనివాసరావు
మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని తిరుపతి జిల్లా టాస్క్ ఫోర్స్ ప్రధాన అధికారి డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. టాస్క్ ఫోర్స్ బృందంలోని జిల్లా గణాంకాధికారి నాగేంద్రకుమార్, ఇన్చార్జ్ డీపీ హెచ్ఎం ఓ బేబీరాణి, డీపీఓ ప్రకాష్ గురువారం పట్టణంలోని బనిగిసాహెబ్ పేట అర్బన్ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు, గర్భవతులు, బాలింతలు రక్తహీనతతో మరణించకూడదన్నారు. అందుకు సంబంధించిన వైద్య సదుపాయాలు సకాలం లో కల్పించాలని తెలిపారు. ప్రతి కాన్పు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగే విధంగా చూడాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు, గర్భవతులకు ఇచ్చే బలవర్ధక ఆహారాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్ క్షేత్ర స్థాయి వైద్య రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిణి షేక్ సల్మ, సూపర్వైజర్లు శకుంతలమ్మ, విక్టోరియా, ఏఎన్ఎం పర్వీన్, స్టాఫ్ నర్స్ విజయమ్మ, దీప్తి, ఫార్మాసిస్ట్ కమలేశ్వర్ రావు, ల్యాబ్ టెక్నీషియన్ ప్రకాష్, డీఈఓ భవాని, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.