ఒడిస్సా నుండి తమిళనాడుకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లలను గూడూరు రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొన్నారు. శనివారం గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూడూరు డీయస్పీ సూర్య నారాయణ రెడ్డి వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రామకృష్ణన్, సతీష్ కుమార్, మురగన్ ఆనంద్ కుమార్ అనే వ్యక్తులు ఒడిస్సా రాష్ట్రంలో గంజాయి కొనుగోలు చేసి ట్రైన్ లో గూడూరుకు చేరుకొని అక్కడి నుండి ఆటోలో జాతీయ రహదారి పోటుపాళెం కూడలికి చెరుకున్నారు. చెన్నై వెళ్ళేందుకు లారీకోసం ఎదురు చూస్తుండగా, విధులలో ఉన్న రూరల్ సీఐ, యస్సై వీరిని అదుపులోకి తీసుకొన్నారు. నిందితులనుండి 22 కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, రెండు వేల యాభై రూపాయల నగదు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రెండు లక్షలా యాభై వేలు ఉంటుందని తెలిపారు.