కనుమూరు హరిచంద్రారెడ్డి సేవలు స్ఫూర్తిదాయకం
గూడూరు : కనుమూరు హరిచంద్రారెడ్డి సేవలు స్ఫూర్తిదాయకమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు అన్నారు. శనివారం గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లూరు ఆదిశేషారెడ్డి స్మారక మాస్టర్ క్రికెట్ లీగ్ 2024 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే, డీఎస్పీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడా, సేవా, అధ్యాత్మిక, సాంస్కృతిక రంగాలలో కనుమూరు హరిచంద్రారెడ్డి నిస్వార్థ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. పదహారేళ్లుగా వెటరన్ పోటీలను గూడూరులో సొంత నిధులతో నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. గూడూరు పట్టణం ముంపుకు గురికాకుండా ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జాతీయ రహదారిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి 150 కోట్లు మంజూరు చేయించామని గుర్తుచేశారు. మరుగుదొడ్ల ఆవశ్యకతను గుర్తించి పట్టణంలో అధునాతన టాయిలెట్లను నిర్మించామన్నారు. రెండో పట్టణం వైపు రైల్వే టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. స్టేడియంలో మహిళల కోసం యోగా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. డీఎస్పీ ఎం. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు క్రీడలకు పుట్టినిల్లు అన్నారు. హరిచంద్రారెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని హర్షణీయన్నారు. పండుగకు ముందే స్టేడియంలో క్రీడాకారులతో పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు. కనుమూరు హరిచంద్రారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కనుమూరు హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇద్దరు స్నేహితుల ఆలోచనతో ప్రారంభైన మాస్టర్ లీగ్ పోటీలు గత పదహారేళ్లుగా ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్నామన్నారు. స్టేడియంలో క్రికెట్ ఈశాన్యం వైపున అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 80 యార్డ్స్ ఉండేందుకు స్థలం కేటాయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావుకు గూడూరు పట్టణ క్రీడాకారులు, క్రీడాభిమానుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సొంతపేరు కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేయాలని యువతకు పిలుపునిచ్చారు. 15ఏళ్లపాటు క్రమం తప్పకుండా ఈ పోటీల నిర్వహిస్తుండం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలను ఆదరిస్తున్న పట్టణ ప్రజలకు, స్టేడియంను క్రీడలను అనుగుణంగా తయారు చేసిన క్రీడాకారులకు మాస్టర్ లీగ్ క్రీడాకారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్రికెట్ పోటీలను అతిధుల చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, టీ. నాగేశ్వరరావు, ఆరుజట్ల కెప్టెన్లు, వెటరన్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.