Advertisements

జగన్ పర్యటన కేవలం కంటితుడుపు చర్య

గూడూరు : తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటన కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, కాళహస్తి, చిల్లకూరు మండలాలలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. రైతులతో నేరుగా మాట్లాడారు. అనంతరం సాయంత్రం గూడూరు పట్టణంలోని ఆషిక్ గ్రాండ్ హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు పాదయాత్ర చేయడం కాదని, ప్రజల కష్ట సుఖాలుతెలుసుకోవాలనుకుంటే మిచౌంగ్ సృష్టించిన భీభత్సాన్ని పాదయాత్ర చేసి తెలుసుకోవాలని అభిప్రాయపడ్డారు. తిరుపతి జిల్లాలో సుమారు 60వేల ఎకరాలలో వరిపైరు కుళ్లిపోయిందన్నారు. జామ, జామాయిల్, సవక, నిమ్మ, మామిడి, బొప్పాయి, అరటితోటలు ధ్వంసమయ్యాయన్నారు. రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరానికి 30 వేల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే నాలుగు రోజులుగా వరదనీళ్లలోనే  ఉంటూ సర్వం కోల్పోయిన పేదలకు పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాలలో నేటికీ తుఫాన్ బాధితులకు బియ్యం కూడా పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో, శివారు, మునక ప్రాంతాలలో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు, దుస్తులు యుద్ధ ప్రాతిపదికన అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో జగన్ పర్యటన కనీసం ఆ గ్రామ ప్రజల గోడు వినేందుకు కూడా అవకాశం లేకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ గాలియాత్రలు (ఏరియల్ సర్వే) ఆపి పాదయాత్రలు చేయాలని హితవు పలికారు. నిరంకుశత్వం, అహం ఉంటే అథఃపాతాళానికి దిగజారడం ఖాయమన్నారు. కేసీఆర్ కు పట్టిన గతే జగన్ కూ

పడుతుందన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రామానాయుడు, తిరుపతి, నెల్లూరు జిల్లాల కార్యదర్శులు మురళి, దామా అంకయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్, జరమాల గురవయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కన్వీనర్ షానవాజ్, తిరుపతి జిల్లా నాయకులు సీవీఆర్. కుమార్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు, గీతా భాస్కర్, మురళి, అన్వేష్, సుబ్రమణ్యం, ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్. జమాలుల్లా, ఎన్ఆర్ఐ కార్యదర్శి షేక్. ఇలియాజ్  తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment