గూడూరు : సమిష్టి పోరాటాలతోనే హక్కులను సాధించుకోగలమని తిరుపతి జిల్లా ఏఐటీయూసీ నిర్మాణ బాధ్యులు శివ కుమార్ అన్నారు. ఆదివారం గూడూరు పట్టణంలోని లయోలా కళాశాలలో ఏఐటీయూసీ నియోజకవర్గ ప్రథమ మహాసభను కే. నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో చేరిన తర్వాత ఈ ప్రాంతంలో ఏఐటీయూసీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అసంఘటిత రంగ సంఘాలన్నింటినీ సంఘటితమై సమస్యలపై సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. డిసెంబర్ 17, 18, 19 తేదీలలో నిర్వహించనున్న ఏఐటీయూసీ ప్రథమ జిల్లా మహాసభలను వందలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ముఠా వర్కర్స్ యూనియన్ 1987లో ఏర్పాటు చేశామన్నారు. అప్పటినుండి ముఠా కార్మికుల అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే చట్టాలు రూపొందించి అమలు చేస్తోందన్నారు. దీనిని సీపీఐ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఏఐటీయూసీ దేశంలో తొలి కార్మిక యూనియన్ అన్నారు. 103 ఏళ్లు పూర్తి చేసుకున్న సంస్థ అన్నారు. 1996లో భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఏఐటీయూసీదేనన్నారు. ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు హేమావతి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని మన తరపున పోరాడుతున్న ఏకైక యూనియన్ ఏఐటీయూసీ అన్నారు.
ఆశ వర్కర్ల హక్కుల కోసం ఏఐటీయూసీతో కలిసి పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం 27 మందితో ఏఐటీయూసీ నియోజకవర్గ సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, ఏఐటీయూసీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చాముండేశ్వరి, ధనమ్మ, ఆటో యూనియన్, ముఠా వర్కర్స్, నాన్ టీచింగ్ యూనియన్, ఆశ వర్కర్లు, ఆర్టీసీ యూనియన్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.