Advertisements

బీజేపీ రాజకీయ కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం

పొంగులేటి శ్రీనివాసులు ఇంటిపై సీబీఐ, ఈడీ దాడులు అప్రజాస్వామికం
ఇబ్రహీం పట్నం కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ నాయకుల దాడి దారుణం
సుదీర్ఘంగా బెయిల్ పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్
కేంద్రం మద్దతుతోనే చంద్రబాబు జైలుకు
ఇండియాను చూసి బీజేపీ నేతల గుబులు
సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ

గూడూరు : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ అన్నారు. గురువారం గూడూరులోని ఆషిక్ గ్రాండ్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి సీపీఐ, సీపీఎం ఎన్నికలలో పోటీ చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం సీపీఐ అభ్యర్థిగా పూనమనేని సాంబశివరావుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పొల్గొన్నారని తెలిపారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావు ఇంటిపై సీబీఐ, ఈడీ లతో దాడులు చేయించి ఇళ్లు, వాహనాలు సీజ్ చేశారన్నారు. అలాగే ఆంధ్రలో మోదీ, అమిత్ షాల  సహకారం లేనిదే  నాలుగు దఫాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబును జైలుకు పంపించలేన్నారు. 70వేల కోట్ల అక్రమ ఆస్తుల ఆరోపణలు ఎదుర్కొంటూ 13 కేసులుండి రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోనే సుదీర్ఘ కాలం బెయిల్ పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్ అన్నారు. రాజకీయాలలో విమర్శలు, విభేదాలు సర్వ సాధారణమన్నారు. కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. దేశంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలపై యధేచ్చగా దాడులు కొనసాగుతున్నాయన్నారు. కొన్ని బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్లతో, ఈడీ, సీబీఐ, ఇన్వెస్టిగేషన్ శాఖలతో దాడులకు ఉసిగొల్పడం బీజేపీ కుటిల రాజకీయానికి నిదర్శమన్నారు.  బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సిసోడియాను లిక్కర్ స్కాంలో జైలుకు పంపించారన్నారు. ప్రస్తుతం అదే కేసులో కేజ్రీవాల్ అరెస్టుకుప్రయత్నిస్తున్నారన్నారు. నెల్లూరులో ప్రారంభమైన లిక్కర్ స్కాం హైదరాబాద్ కు చేరిందన్నారు. వైసీపీ నాయకులకే లిక్కర్ తయారీ కంపెనీలున్నాయన్నారు. ఈ స్కాంలో కీలకపాత్ర ఆంధ్రలో వైసీపీ నాయకులు, తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులదేనన్నారు. అయితే ఆ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తుండడంతో లిక్కర్ స్కాం ఢిల్లీకి చేరిందన్నారు. బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను తొక్కివేయడమే  కేంద్ర పాలకుల లక్ష్యంగా ఉందన్నారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ వైసీపీయేనన్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయనే విషయాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారన్నారు. అలాగే దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమి రోజు రోజుకూ పుంజుకుంటోందన్నారు. దీంతో బీజీపీ పాలకుల గుండెల్లో గుబులు పట్టుకుని దేశ వ్యాప్తంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాళేశ్వరం కుంభకోణంతో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారిందన్నారు. ఎన్నికల అనంతరం వీఆర్ఎస్  (వాలంటరీ రిటైర్మెంట్ సంస్ద) గా మారుతుందని ఎద్దేవా చేశారు.  పాలక పార్టీ అవినీతినైనా సహించవచ్చు కానీ అహంభావం, నిరంకుశ వైఖరిని సమర్థించలేమన్నారు. టీఆర్ఎస్ పాలకుల్లో అహంభావం అహంకారం, నిరంకుశ వైఖరి తారా స్థాయికి చేరాయన్నారు.  తెలంగాణలో  ఆ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. అనంతరం ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి
జీ. శశి కుమార్, సీపీఐ చిల్లకూరు మండల కార్యదర్శి జీ. రమేష్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకులు మురళి, శ్రీనాధ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment