
తమ్ముడికి గ్రీటింగ్స్ లో చిరు టైమింగ్ అదుర్స్
కేంద్ర మాజీ మంత్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు, ఏపీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన జనసేన ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదిక తన సోదరుడికి ఆయన అభినందనలతో పాటు ఆశీస్సులను అందించారు. ఈ సందర్భంగా నా తమ్ముడు అంటూ చిరంజీవి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభా వేదికపై నాగబాబు ప్రసంగానికి కాసేపు ముందుగా చిరంజీవి తన గ్రీటింగ్స్ సందేశాన్ని పోస్ట్ చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఎమ్మెల్సీగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తొలిసారి అడుగు పెట్టబోబుతన్న నా తమ్ముడు నాగేంద్ర బాబుకు నా అభినందనలు, ఆశీస్సులు అంటూ చిరంజీవి సదరు సందేశంలో పేర్కొన్నారు. ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ… వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని… వారి అబిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తున్నానని చిరు ఆకాంక్షించారు. నాగబాబును అభినందిస్తూ చిరంజీవి పోస్ట్ చేసిన ఈ సందేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిమిషాల వ్యవధిలోనే వేల కొద్ది వ్యూస్ దక్కాయి. ఈ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో రాకెట్ లా దూసుకుపోతోందని చెప్పక తప్పదు.
ఏపీలో ఇటీవలే ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదికార కూటమికి మొత్తం 5 సీట్లు దక్కగా.. వాటిలో ఓ స్థానాన్ని నాగబాబుకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఓ సీట్లలో నాగబాబుకే తొలుత సీటు కేటాయింపు జరిగింది. తొలుత నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ కల్యాణ్ భావించినా.. చంద్రబాబు సలహాతో ఎమ్మెల్సీతో పాటు కేబినెట్ లోకి నాగబాబు ఎంట్రీకి ఒప్పుకున్న సంగతి తెలిసింది. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోగా… ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా చట్టసభలోకి అడుగుపెట్టబోతున్నారు. త్వరలోనే ఆయన మంత్రిగానూ కొలువుదీరనున్నారు. ఇలాంటి సందర్భంలో చిరంజీవి గురి చూసి పార్టీ ఆవిర్భావ వేడుకలపై తన సోదరుడు ఉన్న సమయంలో ఆయనను అభినందిస్తూ సందేశం పంపడం గమనార్హం.