Advertisements

పాలిటిక్స్‌లో ప‌వన్‌… సినిమాల్లో నాని!

పాలిటిక్స్‌లో ప‌వన్‌… సినిమాల్లో నాని!

100 % స్ట్ర‌యిక్ రేట్‌… ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ల్ల రాజ‌కీయాల్లో ఈ మాట విన‌గ‌లిగాం. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజ‌యం సాధించిన అరుదైన ఘ‌న‌త ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంతం చేసుకొన్నాడు. అదో అద్భుతం, అపూర్వం. సినిమాల్లోనూ ఇలాంటి స్ట్ర‌యిక్ రేట్ వుంది. ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి, అనిల్ రావిపూడి ఈ ఘ‌న‌త సాధించారు. నిర్మాత‌గా మాత్రం ఈ ఛాన్స్ నానికే ద‌క్కింది.

వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ స్థాపించి నాని నిర్మాత‌గా మారాడు. త‌న అభిరుచికి త‌గిన క‌థ‌ల్ని ఎంచుకొని, కొత్త ద‌ర్శ‌కుల్ని, కొత్త న‌టీటుల్నీ, సాంకేతిక నిపుణుల్నీ ప్రోత్స‌హిస్తున్నాడు. ఆ..లాంటి క‌థ‌ని తెర‌పైకి తీసుకురావాలంటే చాలా ద‌మ్ము ఉండాలి. ఆ ధైర్యం చేయ‌బ‌ట్టే టాలీవుడ్ కు కొత్త త‌ర‌హా సినిమా చూపించ‌గ‌లిగాడు నాని. అంతే కాదు.. ప్ర‌శాంత్ వ‌ర్మ అనే ద‌ర్శ‌కుడ్ని ప‌రిచ‌యం చేయ‌గ‌లిగాడు. ఆ త‌ర‌వాత ప్ర‌శాంత్ వ‌ర్మ ఎలాంటి సినిమాలు చేశాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. హిట్ 1, హిట్ 2 సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యాల్ని అందించాయి. శైలేష్ కొల‌ను అనే ద‌ర్శ‌కుడు ఈ సినిమాల‌తో స‌త్తా చాటాడు. ఇప్పుడు ‘హిట్ 3’ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా విడుద‌ల‌కు ముందే లాభాల బాట ప‌ట్టే ఛాన్సుంది.

ఇప్పుడు ‘కోర్ట్’ వంతు వ‌చ్చింది. ప‌రిమిత వ‌న‌రుల‌తో తీసిన సినిమా ఇది. అయితే ఓ మంచి కంటెంట్ ని అ సినిమాతో అందివ్వ‌గ‌లిగాడు. అన్ని చోట్లా ఒక‌టే మాట‌…సినిమా బాగుంది అని. రివ్యూలూ బాగా వ‌చ్చాయి. ఈ సినిమాపై న‌మ్మ‌కంతో రెండు రోజుల ముందే ప్రీమియ‌ర్లు వేశాడు నాని. అంతే కాదు… ‘కోర్ట్ నచ్చ‌క‌పోతే హిట్ 3 చూడొద్దు’ అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. సినిమా అటూ ఇటు అయితే నానిని సోష‌ల్ మీడియాలో గ‌ట్టిగా ట్రోల్ చేసేవారు. ఆ ప్ర‌భావం ‘హిట్ 3’ పై కూడా ఉండేది. ఇవన్నీ తెలిసి కూడా రిస్క్ చేయ‌గ‌లిగాడు నాని. దానికి తగిన ఫ‌లిత‌మే వ‌చ్చింది. రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ సంపాదించుకొన్న సినిమా ఇది. ఇప్పుడు బాక్సాఫీసు నుంచి వ‌సూళ్లు ఎంతొస్తాయో చూడాలి.

వ‌రుస‌గా నాలుగు విజ‌యాల‌తో నిర్మాత‌గా 100 % స్ట్ర‌యిక్ రేట్ సాధించాడు నాని. ఈ సినిమాల‌న్నీ ఒక ఎత్తు. రాబోతున్న హిట్ 3 మ‌రో ఎత్తు. చిరంజీవి – శ్రీ‌కాంత్ ఓదెల కాంబోలో వ‌స్తున్న సినిమాకు కూడా నాని స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓర‌కంగా ఆ ప్రాజెక్ట్ సెట్ చేసింది నానినే. ఈ రెండు సినిమాల్నీ హిట్ బాట ప‌ట్టిస్తే నిర్మాత‌గానూ నాని రేంజ్ మారిపోవ‌డం ఖాయం.

Leave a Comment