
ఆస్తి పన్ను చెల్లించకుంటే అంతే.. ఆస్తులు సీజ్ చేస్తున్న జీహెచ్ఎంసీ
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 వేల కోట్లు వసూళ్లే టార్గెట్
మొండి బకాయిదారులపై జీహెచ్ఎంసీ కొరడా
ఇప్పటికే 200 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన అధికారులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేరుకుపోయిన పన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించారు. మొండి బకాయిదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. తొలుత నోటీసులు జారీ చేసి, అప్పటికీ స్పందించకుంటే ఆస్తులను సీజ్ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా (మార్చి 31) రూ.2 వేల కోట్లు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుని, ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. టార్గెట్ చేరుకోవడానికి రూ.6 లక్షలకు పైగా బకాయిలు ఉన్న వారికి డిస్ట్రెస్ వారెంట్ నోటీసులు జారీ చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ పన్ను వసూళ్లలో వేగం పెంచారు.
నివాస భవనాల పేరుతో అనుమతి తీసుకుని కమర్షియల్ పొంది, వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న భవనాల యజమానులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. పన్ను తప్పించుకునేందుకు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్న వారికి భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు. కాగా, జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను బకాయిపడ్డ వాటిలో పలు ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పన్ను చెల్లించని రూ.200 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన బల్దియా.. ఎగవేతదారులపైనా ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు, కోట్ల రూపాయల బకాయిలున్న యజమానులు వన్ టైమ్ సెటిల్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.