
అమిత్ షా చెప్పిన సగం నిజం గురించి మాట్లాడుకోవాల్సిందే
అవునన్నా.. కాదన్నా దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది పాలకులకు పెద్ద మనసు లేదన్నది నిజం. ఆ విషయాన్ని తన పదేళ్ల పాలనతో ఫ్రూవ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అదేమంటే.. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో డెవలప్ మెంట్ తక్కువగా ఉంది కదా? అని చెబుతూ వారికి భారీగా నిధులు కేటాయించటం కనిపిస్తుంది. ఒక దేశంలో ప్రాంతాల మధ్య విభేదాలు ఏమిటి? మనమంతా ఒకే దేశం కదా? అన్న భావన మంచిదే. అదే సమయంలో ప్రాంతాల మధ్య తేడాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రానిదే.
డెవలప్ మెంట్ తక్కువగా ఉందని ఉత్తరాది మీదనే ఫోకస్ చేసే వేళలో.. దక్షిణాదికి తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని మాటల్లోనూ.. చేతల్లోనూ చేసి చూపించాలి కదా? అలాంటిదేమీ లేనప్పుడు సౌత్.. నార్త్ అన్న తేడా రాకుండా ఉంటుందా? ఇదంతా ఒక ఎత్తు అయితే.. పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గుతాయన్న ఆందోళన ఎక్కువగా ఉంది.దీనికి కారణం గడిచిన కొన్నేళ్లుగా దక్షిణాధి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు.. ఉత్తరాదితో పోలిస్తే తక్కువగా ఉండటమే.
జనాబా ఆధారంగా లోక్ సభ స్థానాల్ని ఏర్పాటు చేయటమంటే.. అప్పుడు సౌత్ కు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇక్కడే ఒక విషయం మీద ప్రధాన చర్చ జరుగుతోంది. కుటుంబ నియంత్రణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా జనాభా పెరుగుదల రేటు వేగానికి చెక్ పెట్టటంలో సౌత్ కీలక పాత్ర పోషించింది. అదిప్పుడు శాపంగా మారిందని.. పునర్విభజనలో సీట్లు తక్కువగా కేటాయింపు జరగనుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఈ అంశంపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్య చేశారు. పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు తగ్గవని ఆయన చెప్పారు. శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు తమిళనాడులోని కోయంబత్తూరుకు వచ్చిన ఆయన బీజేపీ నేతలతో మాట్లాడుతూ.. ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి.. ఆయన కుమారుడు అసత్య ప్రచారం చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ ఇచ్చిన వాగ్దానం మేరకు దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రోరేటా విధానం ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదని.. దక్షిణాది రాష్ట్రాలకు తాము అన్యాయం చేస్తున్నామనటంలో నిజం లేదని చెప్పారు. నిధుల కేటాయింపులోనూ తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని సీఎం స్టాలిన్ ఆరోపించటం తగదన్న అమిత్ షా.. మోడీ సర్కారు గడిచిన పదేళ్లలో రూ.5.08 లక్షల కోట్లు ఇచ్చినట్లు వివరించారు.
ఇక్కడే అమిత్ షా మాటల్లోని సగం నిజాన్ని ప్రస్తావించాలి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి పన్నుల రూపంలో భారీగా చెల్లింపులు జరుపుతాయి. ఇక్కడ ఇష్యూ ఏమంటే.. తమకు వచ్చే పన్నుల మొత్తాన్ని అమిత్ షా ఎప్పుడూ చెప్పరు. కేవలం తాము రాష్ట్రానికి ఇచ్చిన మొత్తాన్ని మాత్రమే ఘనంగా చెబుతారు. ఇదే ఇష్యూ తెలంగాణలోనూ ఉంటుంది. అప్పట్లో కేటీఆర్.. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుంటారు. కేంద్రానికి రాష్ట్రాల వారీగా వచ్చే పన్ను ఆదాయం ఎంత? దానికి తగ్గట్లు ఎంత మొత్తం రాష్ట్రానికి ఖర్చు పెడుతున్నారన్నప్పుడు లెక్కలు ఇట్టే అర్థమవుతాయి.
కానీ.. తమకు వచ్చే ఆదాయం గురించి మాట్లాడని అమిత్ షా.. చేసే ఖర్చు గురించి మాత్రమే మాట్లాడతారు. ఇదే తెలివిన ఎంపీ సీట్ల పునర్విభజన సందర్భంలోనూ చోటు చేసుకుంటుందన్నదే సందేహం. ప్రోరేటా ప్రకారం ఒక్క సీటు తగ్గదని చెబుతున్నా.. ఆ మాటలోని లోగుట్టు తప్పక ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
నిజానికి దక్షిణానికి.. ఉత్తరానికి మధ్య సీట్ల అంతరం ఇప్పటికే చాలా ఎక్కువ. ఇప్పుడు జనాభా ఆధారంగా లెక్క వేసి సీట్ల పెంపు లెక్కలు వేస్తే.. సౌత్ కు నష్టం భారీగా ఉంటుంది. ఈ విషయాన్నితనదైన మాటల్లో అమిత్ షా సగం నిజాన్ని చెప్పటం ద్వారా.. ఇప్పటికి సంత్రప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమనుకుంటే.. పునర్విభజనకు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసి.. చర్చకు నిలిస్తే నిజం ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది. కాదంటారా?