
నేను బీజేపీతో సన్నిహితంగా ఉన్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: డీకే శివకుమార్
పుట్టుకతోనే తాను కాంగ్రెస్ వాదినన్న డీకే శివకుమార్
అమిత్ షాతో భేటీ కాలేదని వెల్లడి
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన
తాను బీజేపీతో సన్నిహితంగా ఉన్నానంటూ తప్పుడు ప్రచారం
చేస్తున్నారని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపడ్డారు. మహా శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ సీనియర్ నేత, హోంశాఖ మంత్రి అమిత్ షా, డీకే శివకుమార్ ఒకే వేదికను పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో అమిత్ షాతో డీకే శివకుమార్ భేటీ అయ్యారని, బీజేపీకి ఆయన దగ్గరవుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై డీకే శివకుమార్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కేవలం వదంతులేనని, తాను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదినని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువునైన తాను అన్ని మతాలను గౌరవిస్తానని, జైలులో ఉన్నప్పుడు సిక్కు మతం గురించి తెలుసుకున్నానన్నారు.
తన వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన బెడితే, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే కాంగ్రెస్ సిద్ధాంతమని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మైసూరుకు చెందిన సద్గురు తమ ఇంటికి వచ్చి శివరాత్రి వేడుకలకు అహ్వానించారని, ఆయనకు ఉన్న విజ్ఞానం దృష్ట్యా ఎంతో గౌరవిస్తానని తెలిపారు. దీంతో బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నానని, అమిత్ షాతో భేటీ అయినట్లుగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతోందని డీకే శివకుమార్ వాపోయారు.