కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం… పరుగులు పెట్టిన భక్తులు!
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళాలోని టెంట్ సిటీ 19వ సెక్టార్ లో ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు గ్యాస్ సిలిండర్లు పేలడం, ఒక్కసారిగా మంటలు, నల్లటి పొగ కమ్ముకోవడంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. సుమారు 15 నుంచి 18 గుడారాలు పూర్తిగా దగ్ధమైనట్టు భావిస్తున్నారు.
భక్తులను తరలించిన పోలీసులు
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఆ చుట్టుపక్కల గుడారాల నుంచి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తొలుత గీతాప్రెస్ కు చెందిన టెంట్లలో మంటలు చెలరేగాయని… ప్రాణనష్టం జరిగినట్లు సమాచారమేదీ లేదని మహా కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. అగ్ని ప్రమాదానికి పూర్తి కారణాలు, నష్టం వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.