ఇప్పటి వరకు 8.70 లక్షల మంది రక్తదానం చేశారు: నారా భువనేశ్వరి
ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్న భువనేశ్వరి
ఎన్టీఆన్ సేవలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఏర్పాటు చేశామని వెల్లడి
ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్లో ఉచిత విద్య, వసతి అందిస్తున్నామన్న భువనేశ్వరి
ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని నారా భువనేశ్వరి చెప్పారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహా నటుడు ఎన్టీఆర్ అని అన్నారు. రాజకీయరంగంలో ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పారు. ఎన్టీఆర్ సేవలను ముందుకు తీసుకెళ్లేందుకే ఎన్టీఆర్ ట్రస్టును ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ ప్రతి వర్ధంతికి లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని భువనేశ్వరి తెలిపారు. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు, మరొకరి జీవితంలో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ట్రస్టుకు 8.70 లక్షల మంది రక్తదానం చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని అందించామని చెప్పారు. హైదరాబాద్ చర్లపల్లిలోని ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్లో ఉచిత విద్య, వసతి, భోజనం కల్పిస్తున్నామని తెలిపారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నామని చెప్పారు. కరోనా, తుపాన్ల సమయంలో అనేక సేవలు అందించామని వెల్లడించారు.