స్థానిక సంస్థల ఎన్నికల తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..!!
తెలంగాణలో మరో సమరానికి సీఎం రేవంత్ సై అంటున్నారు. పథకాల అమలుకు ఈ నెల 26 ముహూర్తంగా ప్రకటించారు. దీంతో, స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ సమయంలోనే వెళ్లాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
ఏఐసీసీ సైతం తాజాగా ఈ ఎన్నికల పైన దిశా నిర్దేశం చేసింది. బీఆర్ఎస్, బీజేపీ ను దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. సీఎం రేవంత్ దావోస్ నుంచి వచ్చిన తరువాత ఎన్నికల నిర్వహణ పైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
ప్రభుత్వం కసరత్తు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 26 నుంచి పథకాల జాతర ప్రారంభం కానుంది. రైతు భరోసా తో పాటుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది. ఈ పథకాల వేడిలోనే ఎన్నికల నిర్వహణ ద్వారా ఏకపక్షంగా ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తాజాగా జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరగా జరపాలంటూ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మూడు, నాలుగు వారాల్లో గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
పార్టీ సమాయత్తం పార్టీ నేతల సమాచారం మేరకు ఫిబ్రవరి మూడో వారంలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ లకు, నాలుగో వారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ పెంపు అంశం చిక్కుముడిగా మారింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.