Advertisements

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,149 మంది విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ అమలు

విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఈ ఏడాది రూ.28 కోట్లు, వచ్చే విద్యాసంవత్సరంలో రూ.86 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

దేశం, రాష్ట్రం గర్వించే విధంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కన్పరచాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్

కర్నూలు, జనవరి 04:- రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,149 మంది విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ అమలు చేస్తూ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు…

శనివారం స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రాష్ర్ట ప్రభుత్వం ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ కార్యక్రమంలో తాను భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10 వ తరగతి వరకు అమలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం జరుగుతోందన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలు అవుతోందన్నారు.. ఈ ఆర్థిక సంవత్సరంలో 28 కోట్ల రూపాయలను, వచ్చే ఆర్థిక విద్యా సంవత్సరం నుండి 86 కోట్ల రూపాయలను ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు..ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే 1,63,750 మంది విద్యార్థినీ, విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని సీఎస్ తెలిపారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా మేధో శక్తి, శారీరక బలంతో పాటు మానసిక వికాసం కలిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.. కర్నూలు జిల్లాలో ఉన్న 23 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 8678 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు..

రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గాను 398 జూనియర్ కళాశాలలు మధ్యాహ్న భోజనం అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానమై ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడే నాణ్యత కలిగిన భోజనాన్ని తయారు చేసి సరైన సమయానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పంపిస్తారన్నారు..మిగిలిన 77 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు..

మధ్యాహ్న భోజనం మెనూ కూడా ప్రతిరోజు ఒకటే రకమైన మెనూ కాకుండా, రోజు కొక విధంగా ఉండేలా రాష్ర్ట ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు..సోమవారం నాడు కూరగాయల పలావ్, కోడిగుడ్డుకూర, వేరుశనగ బెల్లం చిక్కి, మంగళవారం నాడు పులిహార, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగిజావ, బుధవారం నాడు కూరగాయల అన్నం, ఆలూకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కి , గురువారం నాడు సాంబార్ బాత్/లెమన్ రైస్, టమోట పచ్చడి, ఉడికించన కోడిగుడ్డు, శుక్రవారం నాడు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కి, శనివారం నాడు ఆకుకూర అన్నం, పప్పుచారు, రాగిజావ, స్వీట్ పొంగల్ ఈ విధంగా ప్రోటీన్, ఫైబర్,కార్బోహైడ్రేట్ లతో సమతుల ఆహారం ఉండే విధంగా మెనూ ఉందని సీఎస్ వివరించారు..

రాష్ట్రం, దేశం గర్వించదగ్గ మంచి పౌరులుగా, మంచి మేధావులుగా, అన్ని రంగాల్లో కూడా విశేష ప్రతిభను చూపించి ఈ కళాశాలకు మంచి పేరు తీసుకొని రావాలని సీ ఎస్ విద్యార్థులను ఆశీర్వదించారు..

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కర్నూలు జిల్లాకు విచ్చేసి ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు అమలు చేస్తున్న “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం” లో పాల్గొనడం చాలా గర్వకారణమన్నారు. కార్యక్రమానికి రావాలని ఆహ్వానించగానే సీఎస్.గారు పిల్లలందరినీ కలవాలనే ఉద్దేశంతో కళాశాలకు రావడం జరిగిందన్నారు. జిల్లాలోనే అత్యధిక విద్యార్థిని, విద్యార్థులు ఈ కళాశాలలో ఉన్నారని కలెక్టర్ సీ ఎస్ కు తెలిపారు.. మధ్యాహ్న భోజన పథకం ఇప్పటి వరకు పాఠశాలలలో మాత్రమే ఉండేదన్నారు.. కానీ ఈ రోజు నుండి రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలలో ఈ పథకం అమలు అయ్యేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ తెలిపారు..జిల్లాలో ఈ పథకం సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.

విద్యార్థులతో సహపంక్తి భోజనం

మధ్యాహ్న భోజన పథకం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసారు.. సీ ఎస్ తో పాటు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి విద్యార్థిని , విద్యార్థులతో కలిసి స్వీట్ పొంగల్, అన్నం, పప్పుచారు తో కూడిన భోజనాన్ని స్వీకరించారు..

సీ ఎస్ భోజనం చేసిన అనంతరం అక్కడే ఉన్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎమ్ పిసి చదువుతున్న విద్యార్థిని అఖిల తో, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం సిఈసి చదువుతున్న నైసి ల ఎదురుగా కూర్చుని వారితో సంభాషించారు.. భోజనం ఎలా ఉంది? రుచికరంగా ఉందా? ఎలా చదువుతున్నారు? భవిష్యత్తు లో ఏమి అవ్వాలనుకుంటున్నారు.. లక్ష్యాలు ఏంటి? ఉపాధ్యాయులు ఏ విధంగా పాఠాలను బోధిస్తున్నారు?కళాశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.. మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తున్నారని, తల్లితండ్రుల పేరు నిలబెట్టే విధంగా, బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కేవలం లక్ష్యాలు మాత్రమే పెట్టుకోకుండా వాటిని సాధించేందుకు కష్టపడి చదవాలని ఈ సందర్భంగా సీ ఎస్ విద్యార్థులకు సూచించారు…

కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్ పాల్, డిఎస్పీ మహబూబ్ బాషా, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కల్లూరు తహశీల్దార్ ఆంజనేయులు, కర్నూలు అర్బన్ తహశీల్దార్ వెంకటలక్ష్మి, డివిఈఓ వై.పరమేశ్వర రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సరళ దేవి, ఒకేషనల్ కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపల్ నాగస్వామి, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This