పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్: రామ్ చరణ్
రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్
పవన్ నాడు రాజమండ్రిలో నిర్వహించిన ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్
రాజమండ్రిలో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో రామ్ చరణ్ మాట్లాడారు. సినిమా మీద, సినీ పరిశ్రమ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన అభిమానులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఇవాళ రాజమండ్రిలో ఈ జనసముద్రాన్ని చూస్తుంటే, నాడు పవన్ కల్యాణ్ గారూ ఇదే రాజమండ్రిలో మొదటిసారి నిర్వహించిన ర్యాలీ గుర్తుకొస్తోందని అన్నారు.
“రాజమండ్రిలో గేమ్ చేంజర్ షూటింగ్ ను చాలా రోజుల పాటు చేశాం. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినందుకు పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రికి, ఇతర మంత్రులకు ధన్యవాదాలు. చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను కానీ, చాలా టెన్షన్ గా ఉంది. ఈ సినిమాకు గేమ్ చేంజర్ అని శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు కానీ… నిజంగానే ఈ సినిమా గేమ్ చేంజర్.
నేను తెరపై గేమ్ చేంజర్ పాత్రను చేసి ఉండొచ్చు కానీ… మీకందరికీ తెలుసు… ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఉన్న ఏకైక గేమ్ చేంజర్ పవన్ కల్యాణ్ గారే. ఇవాళ ఆయన పక్కన నిల్చోవడాన్ని అదృష్టంగా భావిస్తాను. జనం కోసం ఇంత తపన పడి, ఇంత ఆలోచించే వ్యక్తి పక్కన ఉండడం… ఆయన కుటుంబంలోనే పుట్టడం అదృష్టంగా భావిస్తాను.
శంకర్ గారు తన సినిమాల్లో నిజజీవితంలోని వ్యక్తులనే పాత్రలుగా మలిచి కథలు రాస్తుంటారు. నిజజీవితంలో పవన్ కల్యాణ్ వంటి వ్యక్తిని చూసి రాసిన క్యారెక్టరే గేమ్ చేంజర్. సమయాభావం వల్ల ఎక్కువ సేపు మాట్లాడలేకపోతున్నాను… మరో వేదికపై ఎక్కువ సేపు మాట్లాడతాను… మా డిప్యూటీ సీఎం గారు, మా ఓజీ మాట్లాడితే వినాలని నాకు కూడా ఉంది… ఓకేనా” అంటూ రామ్ చరణ్ తన బాబాయి పవన్ పాదాలకు నమస్కరించారు.