వెనక్కి వెళితే కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది!: రేవంత్ రెడ్డి
మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం
కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం
ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి రైతులకు రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడి
గతంలో ఏం జరిగిందనే విషయంపై వెనక్కి వెళితే కేసీఆర్ కుటుంబం వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈరోజు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు సీఎం పైవిధంగా స్పందించారు. గతంలో ఏం జరిగిందనే విషయాలను పక్కన పెట్టి… భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా… నిజమైన రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ఎన్నికలకు ముందు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… ప్రస్తుత వెసులుబాటు, ఆర్థిక పరిస్థితిని బట్టి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయినా గతంలో ఉన్న రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచినట్లు చెప్పారు.