కోటిమంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం
యునైటెడ్ ఇండియాతో పార్టీ తరపున లోకేష్ ఎంఓయు
జనవరి 1నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్
అమరావతి: మరికొద్దిరోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈమేరకు మంత్రి లోకేష్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. కోటిమంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31,2025వరకు కోటిమంది కార్యకర్తల భీమా కోసం తొలివిడతలో రూ.42కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద భీమా లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమనిధి సారధిగా యువనేత నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకూ రూ.138కోట్లు ఖర్చుచేశారు. గత అరాచక ప్రభుత్వంలో కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయవిభాగాన్ని ఏర్పాటుచేశారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటుచేశారు. మృతిచెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తోపాటు కృష్ణాజిల్లా చల్లిపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేసి ఉచితంగా విద్యనందిస్తున్నారు. కుటుంబసభ్యుల మాదిరి పార్టీ కేడర్ ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేష్ చేస్తున్న కృషిపై కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.