Advertisements

అక్కడ న్యూ ఇయర్‌ వచ్చేసింది.. 2025కు గ్రాండ్ వెల్‌కమ్‌

అక్కడ న్యూ ఇయర్‌ వచ్చేసింది.. 2025కు గ్రాండ్ వెల్‌కమ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ దేశాలకు కొత్త అధినేతలను తీసుకొచ్చిన 2024 ఇక చరిత్ర. అది అందించిన జ్ఞాపకాలను మదిలో పదిలం చేసుకొని.. కొత్త అడుగులు వేయడానికి రెడీ అవుతున్నాం.

అయితే మనకంటే ముందే కొన్ని దేశాలు కొత్త ఏడాదిని ఆహ్వానించాయి. పసిఫిక్‌ మహా సముద్రంలోని కిరిబాటి దీవుల్లోని ప్రజలు అందరికంటే ముందే (3.30PM IST) నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన చాతమ్ ఐలాండ్స్‌ (3.45PM IST) 2025లోకి ఎంటర్‌ అయింది.

కొత్త ఏడాదిలోకి న్యూజిలాండ్‌

న్యూజిలాండ్‌ వాసులు కూడా 2025 (New year 2025)లోకి అడుగుబెట్టారు. భారత్‌లో కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆ దేశం కొత్త ఏడాదిని స్వాగతించింది. ఆనందోత్సాహాల మధ్య కివీస్‌ ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఆక్లాండ్‌ స్కై టవర్‌ వద్ద న్యూఇయర్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

ఏయే దేశాల్లో ఎప్పుడు..

  • ఆస్ట్రేలియాలో మనకంటే అయిదున్నర గంటల ముందు నూతన సంవత్సరం మొదలవుతుంది.
  • ఇక సూర్యుడు ఉదయించే దేశంగా పేరున్న జపాన్‌ కూడా మూడున్నర గంటల ముందే 2025లోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. భారత్‌ పొరుగు దేశాలైన భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెళ్తాయి.

ఒకేసారి 43 దేశాల్లో..

సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు మనం 2025లోకి అడుగుపెడతాం. అదే సమయానికి భారత్‌తో పాటు శ్రీలంకలోనూ జనవరి ఒకటి వస్తుంది. ఇక మన తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతో పాటు కాంగో, అంగోలా, కామెరూన్‌ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.

చివరగా అక్కడే..

భారత్‌ తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్‌ మొదలవుతుంది. మనకు జనవరి 1 ఉదయం 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది. ఇక కొత్త సంవత్సరం ఆఖరుగా వచ్చే భూభాగాలు అమెరికా పరిధిలోని బేకర్‌, హోవార్డ్‌ దీవులు. అయితే ఇక్కడ జనావాసాలు లేకపోవడంతో అమెరికన్‌ సమోవాను చివరిదిగా పరిగణిస్తారు.

ఇవి ప్రత్యేకం..

రష్యాలో నూతన సంవత్సర (New year) వేడుకలను రెండుసార్లు జరుపుకొంటారు. ఒకటి జనవరి 1 (గ్రెగెరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం). రెండోది జనవరి 14 (పాత జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం). ఇక నూతన సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోని దేశాల్లో చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌, వియత్నాం ఉన్నాయి. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ న్యూఇయర్‌ వేడుకలు జరుగుతాయి.

Leave a Comment

You May Like This