లోకేష్ మార్క్ – మంగళగిరిలో లక్షకుపైగా టీడీపీ మెంబర్ షిప్ !
తెలుగుదేశం పార్టీ చరిత్రలో రెండో సారి మాత్రమే గెలిచిన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. 90 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను లక్ష దాటించారు. గతంలో ఎప్పుడూ ఇంత భారీ మొత్తంలో సభ్యత్వాలు నమోదు కాలేదు. నియోజకవర్గ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో రూ. లక్ష కడితే టీడీపీకి శాశ్వత సభ్యులుగా చేరొచ్చు. ఇలాంటి శాశ్వత సభ్యత్వాలలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మంగళగిరి నిలిచిందని పార్టీ వర్గాలు ప్రకటించాయి.
పార్టీ సభ్యత్వాలను బలవంతంగా చేయించలేరు. ప్రజలు ఆసక్తి చూపిస్తేనే సాధ్యమవుతుంది. మంగళగిరి విషయంలో నారా లోకేష్ పెడుతున్న శ్రద్ద.. అక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటున్న వైనం ప్రజల్ని ఆకట్టుకుంటోంది. కుల, మత వర్గాలకు అతీతంగా లోకేష్ పై మంగళగిరిలో అభిమానం కనిపిస్తోంది.లోకేష్ కూడా ఓ పద్దతిలో పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉందన్న అహంకారం ద్వితీయ శ్రేణి నేతల్లో రాకుండా చూస్తున్నారు. వారిని కూడా ప్రజలకు జవాబుదారీ చేస్తున్నారు. ఇది గ్రామాల్లో టీడీపీపై మరింతగా అభిమానం పెంచుకోవడానికి కారణం అవుతోంది.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం మంగళగిరి. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో అరవై ఆరు శాతం ఓట్లు లోకేష్‌కు పడ్డాయి. దాదాపుగా లక్షా డెభ్బై వేల ఓట్లు వచ్చాయి. ఓట్లు వేసిన వారంతా టీడీపీ సభ్యులు కాదు. కానీ వారిలో లక్ష మందికిపైగా టీడీపీ కుటుంబంలో భాగమయ్యేలా చేయడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. కార్యకర్తలకు అండగా ఉంటారన్న భరోసాతో రికార్డు స్థాయి సభ్యత్వాలు నమోదయ్యాయి.