ఏపీ సర్కార్‌కు సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక సూచనలు
వీలైనంత త్వరగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న జస్టిస్ ఎన్వీ రమణ
గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంగ్లిష్ మీడియం జీవో రద్దు చేయాలన్న జస్టిస్ ఎన్వీ రమణ
గతంలో ఉన్న విద్యావిధానాన్నే పునరుద్దరించాలని కోరిన జస్టిస్ ఎన్వీ రమణ
ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక సూచనలు చేశారు. విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో శనివారం ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వీలైనంత త్వరగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.85ను రద్దు చేయాలన్నారు. గతంలో ఉన్న విద్యావిధానాన్నే పునరుద్దరించాలని ఆయన సూచించారు. మాతృభాష పరిరక్షణకు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల తరహాలో ఇక్కడా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరాయి దేశాల భాష, సంస్కృతుల్లోని మంచిని తీసుకుంటే తప్పులేదు కానీ గుడ్డిగా అనుకరిస్తేనే నష్టపోతామని అన్నారు.
ప్రజలే భాషను రక్షించుకోవాలన్నారు. తెలుగు పరిరక్షణ ఉద్యమం ప్రజల కోసమే గానీ ప్రభుత్వ వ్యతిరేకం కాదని అన్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించాలన్నా, ఉద్యోగాలు సంపాదించాలన్నా కేవలం ఇంగ్లిషు వల్లే సాధ్యమన్న భ్రమలో ఉన్నారని, అది సరికాదని పేర్కొన్నారు.