సోషలిజంతోనే సమాజాభివృద్ధి
దేశ సమగ్రత, సమైక్యత, సమానత్వం కోసం సమర శీల పోరాటాలు
ప్రజా శ్రేయస్సుకై కమ్యూనిస్టులను బలపరచాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్. ప్రభాకర్ వెల్లడి
గూడూరులో ఘనంగా సీపీఐ శతాబ్ది ఉత్సవాలు
సోషలిజంతోనే సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యపడుతుందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్ అన్నారు. గురువారం గూడూరు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో సీపీఐ ఆవిర్భవించిందన్నారు.
దేశ సమైక్యత, సమగ్రత కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ, దేశ స్వాతంత్య్రం కోసం మీరట్, పెషావర్ కుట్ర కేసులను ఎదుర్కొని బ్రిటిష్ పాలకుల నుంచి దేశాన్ని విముక్తి చేయడంలో సీపీఐ అగ్ర భాగాన నిలిచిందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, విద్యాహక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం తీసుకురావడంలో పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నల్లధనం వెలికితీత, పన్నుల భారం తగ్గింపు, ధరల నియంత్రణ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు తదితర హామీల అమలు కోసం, కార్మికులు, కర్షకులను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా సీపీఐ నిరంతరం పోరాడుతుందన్నారు. గత పదేళ్ల నుంచి రాష్ట్ర పాలకులు కేంద్రంలో బీజేపీతో అంటకాగుతూ రాష్ట్రానికి అవసరమైన నిధులు రాబట్టకుండా, ప్రజావ్యతిరేక చట్టాల రూపకల్పనలో బేషరతుగా మద్దతు తెలపడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధిని వికేంద్రీకరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్ మాట్లాడుతూ ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం, దున్నే వాడికే భూమి,
8 గంటల పని విధానం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు చేయాలని పోరాడింది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. వర్గ దోపిడీ, కులవివక్షతలకు, వెట్టి చాకిరి వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలకు పోరాటాలను నేర్పింది కమ్యూనిస్టు పార్టీ అన్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా మాట్లాడుతూ తెలంగాణలో నిజాం రజాకర్లకు వ్యతిరేకంగా జరిపిన సాయుధ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టు కార్యకర్తలను అమరులయ్యారని తెలిపారు. 10 లక్షల ఎకరాలను పేదలకు పంచి, ఉద్యోగ భద్రత, సామాజిక పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలను సాధించింది కమ్యూనిస్టు పోరాటాలే అన్నారు. రాజాభరణాల రద్దు,
బ్యాంకుల జాతీయకరణ, భూ సంస్కరణల చట్టం అమలు కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ఫలితమేన్నారు. ప్రజా శ్రేయస్సు కోరే వారందరూ కమ్యూనిస్టులను రాబోయే రోజుల్లో బలపరచి సమసమాజ అభివృద్ధికి బీజం వేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సీపీఐ కార్యాలయం, పాత బస్టాండు సెంటర్ తదితర ప్రాంతాలలో సీపీఐ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, పట్టణ కార్రదర్శి షేక్ కాలేషా, చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి కె. నారాయణ, డీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంబేటి చంద్రయ్య, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు, బీకేఎంయూ నియోజకవర్గ కార్యదర్శి ఎన్. శ్రీనివాసమూర్తి, ఇన్సాఫ్ రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా, ప్రజా నాట్యమండలి జిల్లా నాయకులు మస్తానయ్య, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి యశ్వంత్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాఘవయ్య, యాకోబు, సీపీఐ నాయకులు, సీతా భాస్కర్, ఆటో యూనియన్ నాయకులు శేషయ్య, శెట్టి, అబ్దుల్లా, ఖాసిం భాయ్ తదితరులు పాల్గొన్నారు.