తాడేపల్లి.
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
ఆరు నెలల్లోనే బయటపడ్డ చంద్రబాబు నిజ స్వరూపం
రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల ఛార్జీల మోత
ప్రజా భాగస్వామ్యంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలు
:మాజీ మంత్రి మేరుగ నాగార్జున ప్రకటన
వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బాపట్ల జిల్లా అ«ధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ప్రెస్‌మీట్.
ఛార్జీలు పెంచబోమంటూ ఎన్నికల ముందు చంద్రబాబు హామీ
కానీ 6 నెలల్లోనే గృహ వినియోగదారులపై 55 శాతం వరకు భారం
ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు సైతం మంగళం
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తీర్చలేకపోతున్న ప్రభుత్వం
ఇప్పటికే కొనసాగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలు
:గుర్తు చేసిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున
గతంలోనూ రూ.20 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీల భారం
అది కూడా అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ వైఫల్యం
ఆ భారాన్ని ప్రజలపై మోపని గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం
ఆ మేరకు డిస్కమ్‌లకు రాయితీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం
టీడీపీ హయాంలో రూ.13,255.76 కోట్ల సబ్సిడీ చెల్లింపు
అదే వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.47,800 కోట్లు
వ్యవసాయ ఉచిత విద్యుత్ సబ్సిడీ ఎగ్గొట్టిన టీడీపీ ప్రభుత్వం
ఆ మొత్తం కూడా చెల్లించిన వైయస్సార్‌సీపీ ప్రభుత్వం
:ప్రెస్‌మీట్‌లో మేరుగ నాగార్జున వెల్లడి
తాడేపల్లి:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై మోపిన రూ.15,485 కోట్ల భారాన్ని ఉపసంహరించుకునే వరకు వైయస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. కూటమి పార్టీల మాయమాటలు నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలపై దుర్మార్గంగా విద్యుత్ ఛార్జీల రూపంలో పెనుభారం మోపుతున్నారని ప్రెస్‌మీట్‌లో మేరుగ నాగార్జున ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో మేరుగ నాగార్జున ఇంకా ఏమన్నారంటే..:
కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు:
కూటమి ప్రభుత్వ పాలనంతా ‘బాదుడే బాదుడు’ అన్నట్లుగా మారింది. ‘ఓట్లేయండి తమ్ముళ్లూ.. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ’.. అని ఎన్నికల ముందు చంద్రబాబు మాయమాటలు చెప్పారు. అన్ని వర్గాలకు వరాలు కురిపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు తిరక్కుండానే యథేచ్ఛగా చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు. తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారు. సూపర్‌సిక్స్‌తో సహా, ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. ఒక్క హామీపైనా త్రికరణ శుద్దితో ఈ ప్రభుత్వం పని చేయడం లేదు.
ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలు:
విద్యుత్ ఛార్జీలపై ఇచ్చిన మాట కూడా మరిచిపోయి ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల బాదుడుకు తెర తీశారు. వాటిలో ఇప్పటికే నవంబరు బిల్లులో రూ.6 వేల కోట్లు వేయగా, వచ్చే నెల నుంచి మరో రూ.9,412 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు. అలా ప్రజల నడ్డి విరుస్తున్నారు. దీంతో విద్యుత్ గృహ వినియోగదారులపై 25 నుంచి 55 శాతం వరకు అదనపు వడ్డన చేస్తున్నారు.
ఎంత దారుణం అంటే.. ఇది శీతాకాలం. అంటే విద్యుత్ వాడకం తక్కువగా ఉంటుంది. ఇప్పుడే ఇంత భారం మోపితే, ఇక వేసవి కాలంలో విద్యుత్ వాడకంపై ఎంత భారం పడుతుందో అర్థం కావడం లేదు. ఆనాడు జగన్ గారు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకూ ఇచ్చిన ఉచిత విద్యుత్‌ను దూరం చేసింది. బిల్లులు చెల్లించాల్సిందేనంటూ వారిని వేధిస్తోంది. ఇప్పుడు తాజాగా అన్ని వర్గాలపైనే విద్యుత్ ఛార్జీల కొరడాను ఝుళిపిస్తోంది.
ఎక్కడా విద్యుత్ కోతలు లేవంటూ అబద్దాలు:
రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 195 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయలేక రాష్ట్రవ్యాప్తంగా సగటున 2 నుంచి 3 గంటల పాటు కోత విధిస్తున్నారు. వాడకం ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. అయినా అధికారిక నివేదికల్లో విద్యుత్ లోటు, కోతలు లేవంటూ బుకాయిస్తున్నారు.
నిజానికి గతేడాది కంటే విద్యుత్ డిమాండ్ 1.17 శాతం తక్కువగా ఉన్నా, అది కూడా సరఫరా చేయలేక ప్రభుత్వం సన్నాయినొక్కులు నొక్కుతోంది. అదే గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిండు వేసవిలోనూ, బొగ్గు సరఫరా సంక్షోభంలోనూ ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడం జరిగింది.
బాబు జమానాలో సబ్సిడీలో కట్:
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు రూ.20 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటగట్టి దిగిపోయింది. అయినా సరే ఆ భారాన్నంతా ప్రజలపై మోపకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీల కింద చెల్లించగా, వైయస్సార్‌సీపీ అధికారంలో ఉండగా రూ.47,800.92 కోట్లను సబ్సిడీగా అందించింది. చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. అదీ జగన్‌గారి కమిట్‌మెంట్.
విద్యుత్ ఛార్జీలపై పోరాటం:
చంద్రబాబులాగా హామీలు ఇవ్వడం, చేతులెత్తేయడం, పారిపోవడం శ్రీ వైయస్ జగన్‌కు తెలియదు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, భావితరాల గురించి ఆయన ఆలోచించారు. కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించకుండా వినియోగదారులపైనే ఛార్జీల భారం మోపుతోంది. విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుతూ, వైయస్సార్‌సీపీ రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తోంది. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మేరుగ నాగార్జున వివరించారు.