Advertisements

ఫైబర్ నెట్ నుంచి 410 మంది వైసీపీ నేతల సహాయకులు, డ్రైవర్ల తొలగింపు!

ఫైబర్ నెట్ నుంచి 410 మంది వైసీపీ నేతల సహాయకులు, డ్రైవర్ల తొలగింపు!

నోటీసులు పంపిన ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి

వైసీపీ నేతలు తమ ఇళ్లలో వారిని పనివారుగా ఉపయోగించుకున్నారని ఆరోపణ

ఫైబర్‌నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నట్టు వెల్లడి

సంస్థ నుంచి చెల్లించిన రూ. 1.5 కోట్లు వెనక్కి ఇవ్వాలని ఆర్జీవీకి నోటీసులు

పంపినట్టు చెప్పిన జీవీరెడ్డి
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్‌లో నియమించుకున్న 410 మందిని తొలగిస్తున్నట్టు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వీరిలో చాలామందికి సరైన అర్హతలు కూడా లేవని పేర్కొన్నారు. వీరిని తొలగించడం వెనక ఎలాంటి ప్రతీకారం లేదని, కాబట్టి ఎలాంటి అపోహలు వద్దని మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

వైసీపీ నేతల ఆదేశాలతోనే వీరి నియామకాలు జరిగాయని, ఇప్పుడీ సంస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగానే వీరిని తొలగిస్తున్నట్టు తెలిపారు. ఫైబర్ నెట్‌లో నియమితులైన ఉద్యోగులను చాలామంది నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు తమ ఇళ్లలో పనిమనిషులుగా, కారు డ్రైవర్లుగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. వీరికి ఫైబర్ నెట్ నుంచి వేతనాలు చెల్లించారని తెలిపారు.

ఫైబర్ నెట్‌ను కాపాడేందుకు కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. మొత్తం 410 మందికి నోటీసులు పంపామని, అవసరాన్ని బట్టి ఉద్యోగులను నియమించుకుంటామని వివరించారు. ఇక, దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు ఫైబర్ నెట్ నుంచి చట్ట విరుద్ధంగా చెల్లించిన రూ. 1.5 కోట్లు వెనక్కి ఇవ్వాలంటూ ఆర్జీవీకి నోటీసులు పంపినట్టు తెలిపారు.

Leave a Comment