అమిత్ షాను వెంటనే కేంద్ర కేబినెట్ నుండి బహిష్కరించాలి
ప్రధాని నరేంద్రమోదీ బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ ఎంపీలపై బీజెపీ దాడి అనైతికం
సీపీఐ, డీహెచ్పీఎస్, ఇన్సాఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్
భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని సీపీఐ, డీహెచ్పీఎస్, ఇన్సాఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం గూడూరు కటకరాజా వీధిలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
సీపీఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్,
డీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంబేటి చంద్రయ్య మాట్లాడారు. 140 కోట్ల దేశ ప్రజలు ఆరాధించే ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాతను పార్లమెంటు సాక్షిగా హోం మంత్రి అమిత్ షా అవమానించడం దారుణమన్నారు. దీనిని ప్రధాని మోదీ సమర్థించడం ప్రజలు గమనిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రశాతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ ఎంపీలపై బీజేపీ ఎంపీలు దాడికి దిగి దౌర్జన్యానికి పాల్పడడం పాలకపక్ష నేతల దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఇన్సాఫ్ రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి యశ్వంత్, సన్నీ, దీపు తదితరులు పాల్గొన్నారు.