అష్పాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లింల పాత్ర కీలకం
దేశ సమగ్రత, జాతీయ సమైక్యత, దేశాభివృద్ధి యువత లక్ష్యం కావాలి
ఏపీ స్టేట్ ఇన్సాఫ్ సమితి డిప్యూటీ సెక్రటరీ షేక్ జమాలుల్లా
గూడూరులో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం
గూడూరు :
దేశ ప్రజలు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్ లను ఆదర్శంగా తీసుకుని మత సామరస్యాన్ని చాటాలని ఆల్ ఇండియా తన్జీమ్ ఏ ఇన్సాఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా పిలుపునిచ్చారు. గురువారం గూడూరు సీపీఐ కార్యాలయ ప్రాంగణంలో స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్ ల వర్థంతి, జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరవీరుల చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఉరి కంబం ముద్దాడిన తొలి భారతీయుడు, తొలి ముస్లిం అష్ఫాఖుల్లా ఖాన్ అన్నారు. 1900 సంవత్సరం అక్టోబర్ 20న ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో అష్పాఖుల్లా ఖాన్ జన్మించారన్నారు. చిన్న తనం నుండే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడన్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరి, రోషన్ మరికొంతమంది విప్లవకారులతో కలిసి కాకోరి వద్ద రైలులో వెళుతున్న బ్రిటిష్ ఖజానాను లూఠీ చేశారన్నారు. దీంతో బ్రిటిష్ పాలకులు అష్ఫాఖుల్లా ఖాన్ ను నిర్భంధించారన్నారు. నా మాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం చేయాలనుకున్నా ను. నా త్యాగం వృథా కాదు. మరెందరో త్యాగధనులకు స్ఫూర్తినిస్తుంది. నా హిందూస్థాన్ స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది. చాలా త్వరగా బానిస సంకెళ్ళు తెగి పోతాయి. దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతున్నానుఅంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడన్నారు. భరతమాత స్వేచ్ఛ కోసం సర్దార్ భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల కంటే నాలుగేళ్ల ముందే ఉరిశిక్షపడిన దేశభక్తుడు అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ అన్నారు. అష్ఫాఖుల్లా ఖాన్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ఉంచి నేటి తరానికి అమరవీరుల త్యాగాలు స్మరించుకునే అవకాశం కల్పించాలని కోరారు. స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్ర కీలకమన్నారు. దేశ సమగ్రత, జాతీయ సమైక్యత, దేశాభివృద్ధి యువత లక్ష్యం కావాలన్నారు. కేంద్ర పాలకులు రామ్ ప్రసాద్ బిస్మిల్ – అష్పాఖుల్లా ఖాన్ ల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలన్నారు. ఇన్సాఫ్ సమితి గౌరవాధ్యక్షులు షేక్ కాలేషా మాట్లాడుతూ దేశంలో జాతీయ సమైక్యతను పెంపొందించాల్సిన పాలకులు మతాల మధ్య చిచ్చు పెట్టి స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి దేశంలో మైనారిటీలను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. వక్ఫ్ చట్టం యథాతథంగా ఉంచాలని, జాతీయ సమైక్యత కోసం కడపలో జమ్యతుల్ ఉలమాయే హింద్ ఇచ్ఛిన పిలుపుమేరకు ఏడు లక్షల మంది ముస్లిం సోదరులు తరలివచ్ఛారని గుర్తుచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వక్ఫ్ చట్టం రద్దును వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్. ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా, నెల్లూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎన్. రమణయ్య, ఏఐటీయూసీ
గూడూరు నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఎంబేటి చంద్రయ్య, కే. నారాయణ, బీకెఎంయూ నియోజకవర్గ కార్యదర్శి ఎన్. శ్రీనివాసమూర్తి, సీపీఐ నాయకులు మస్తానయ్య, సీతా భాస్కర్, వెంకటయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు.