Advertisements

విడదల రజిని, అప్పిరెడ్డి మనుషులే నా కూతురిని చంపేశారు!

విడదల రజిని, అప్పిరెడ్డి మనుషులే నా కూతురిని చంపేశారు!

మాజీ మంత్రి విడదల రజిని, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తులే తన కూతురిని చంపడంతోపాటు ఎదురు తమపైనే హత్య కేసు పెట్టారని ఓ యువతి తల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుట బోరుమన్నారు.

పైగా మాపైనే హత్య కేసు పెట్టి వేధిస్తున్నారు

రెండేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం

టీడీపీ గ్రీవెన్సులో చంద్రబాబుకు మొరపెట్టుకొన్న తల్లి

నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమన్న సీఎం

శనివారం ఆయన ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. గుంటూరు నగరం గుజ్జనగుళ్ల ప్రాంతానికి చెందిన నిశంకర శంకర లీల అనే మహిళ.. తన కుమార్తె హత్యోదంతంపై చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. ‘మాజీ మంత్రి విడదల రజిని, లేళ్ల అప్పిరెడ్డి వద్ద పనిచేస్తున్నామని చెప్పే వ్యక్తులు.. డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న నా కూతురిని వంచించి లోబర్చుకొన్నారు. వారితో తీసుకువెళ్లిపోయారు. 13 నెలల తర్వాత కిరాతకంగా హత్య చేసి నా కూతురి శవాన్ని మా ఇంటికి పంపారు. హంతకులపై చర్య తీసుకోవాలని మేం రెండేళ్లుగా పోరాడుతుంటే ఎదురు మాపైనే హత్య కేసు పెట్టారు. కూతురు పోయిన దుఃఖంతోపాటు.. అక్రమ కేసులో ఇరుక్కొని రెండేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. న్యాయం చేయాలని అప్పటి నల్లపాడు సీఐని కలిసి కోరితే నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో తిట్టి పంపించారు. నిందితులను ఇప్పటికైనా శిక్షించి మాకు న్యాయం చేయండి సార్‌’ అంటూ ఆమె చంద్రబాబు ఎదుట బోరుమన్నారు. ఆమెను చంద్రబాబు ఓదార్చారు.

కేసులో ఎంతటివారున్నా వదిలిపెట్టబోమని, తప్పక న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే, కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న మాజీ జవాన్‌ అక్కల జ్ఞానానందం, తన భార్యతో కలిసి చంద్రబాబుకు ఒక వినతిపత్రం ఇచ్చారు. ‘విజయవాడ నగరంలో మా ఇంటిని గత వైసీపీ ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయలేదు. రూ.కోటిన్నరతో కట్టిన ఇంటిని తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. రూ.98 లక్షలకు కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చిన వ్యక్తి చివరికి రూ.82 లక్షలు చేతిలో పెట్టి మమ్మల్ని పొమ్మన్నాడు. అదేమంటే తన రౌడీ మామూలు అని దబాయించాడు. గత ప్రభుత్వంలో మాకు ఎవరూ సాయం చేయలేదు. మీరైనా విచారణ జరిపించి మోసగాడిపై చర్య తీసుకొని, మా డబ్బు మాకు ఇప్పించండి’ అని భార్యాభర్తలు తమ గోడు వెల్లబోసుకున్నారు. తాను కొనుగోలు చేసిన పొలంలోకి తనను రానివ్వకుండా అడ్డుకొంటున్నారని, తనకు న్యాయం చేయాలని రాజమహేంద్రవరం రూరల్‌ మండలం హుకుంపేటకు చెందిన బొప్పన సురేష్‌ బాబు విజ్ఞప్తి చేశారు.

Leave a Comment