కొత్త మారిటైమ్ పాలసీ తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం
2024-29 ఏపీ మారిటైమ్ పాలసీ విడుదల
మారిటైమ్ పాలసీ అమలుకు నోడల్ ఏజన్సీగా మారిటైమ్ బోర్డు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ మారిటైమ్ పాలసీ 2024 – 29ని కూటమి ప్రభుత్వం
విడుదల చేసింది. రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్స్, ఇతర మారిటైమ్ సేవలు అందించేలా నూతన పాలసీని రూపొందించారు. ఏపీ మారిటైమ్ విజన్‌ను ఆవిష్కరించటంతో పాటు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది.
సుదీర్ఘమైన తీర ప్రాంతం, పోర్టులు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించేలా విధాన రూపకల్పన చేసింది. 2030 నాటికి భారత మారిటైమ్ గేట్ వేగా ఏపీని మార్చేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టింది. కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాలను పెంపొందించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రపంచంలోని 20 భారీ పోర్టుల్లో ఒకటి ఏపీలో ఉండే విధంగా సామర్థ్యం పెంపు లక్ష్యంగా ఈ పాలసీ రూపొందించింది.
2047 నాటికి దేశంలోని పోర్టుల్లో నిర్వహిస్తున్న మొత్తం కార్గోలో 20 శాతం ఏపీలోనే నిర్వహించేలా కార్యాచరణ చేపట్టింది. అలానే పోర్టుకు సంబంధిత వ్యవహారాల్లో 5 వేల మంది నిపుణులను 2028 నాటికల్లా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మారిటైమ్ పాలసీ అమలుకు ఏపీ మారిటైమ్ బోర్డును నోడల్ ఏజన్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.