ఈ వారంలోనే నాగబాబు ప్రమాణ స్వీకారం ?
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. నాగబాబు విజయవాడ చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ వారంలోనే ఉంటుందని చెబుతున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ తో పాటు పదమూడో తేదీన విజన్ డాక్యుమెంట్ ను ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారు. అంటే .. ఈ రెండు రోజులు కష్టమేనని ఆ తర్వాత రోజు ప్రమాణ స్వీకారం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే ఒక్క మంత్రి ప్రమాణ స్వీకారానికి పెద్ద సమయం పట్టదని కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉన్నా… అనుకుంటే రేపైనా పూర్తి చేస్తారని అంటున్నారు. ముహర్తం చూసుకోవాల్సింది నాగబాబేనని ఆయన ఎప్పుడు అంటే అప్పుడు ప్రమాణ స్వీకారం తేదీని ఖరారు చేస్తారని జనసేన నవర్గాలు చెబుతున్నాయి. మరో మంత్రి ప్రమాణ స్వీకారంపై ముఖ్యమంత్రి నుంచి రాజ్ భవన్ కు అధికారిక సమాచారం వెళ్లలేదని తెలుస్తోంది. అధికారికంగా సమాచారం పంపితే రాజ్ భవన్ వర్గాలు ఏర్పాట్లు చేస్తాయి.
ఇప్పటికే నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ శాఖ జనసేన మంత్రి కందుల దుర్గేష్ వద్దే ఉంది. సినీ నేపధ్యం ఉన్న వారికి ఇస్తే మంచి ప్రయోజనం అన్న కారణంగా నాగబాబుకు ఆ శాఖ కేటాయిస్తున్నారని అంటున్నారు