Advertisements

ఈనెల 6 నుంచి వచ్చే నెల జనవరి8 వరకు రెంవెన్యూ సదస్సుల నిర్వహణ

*ఈనెల 6 నుంచి వచ్చే నెల జనవరి8 వరకు రెంవెన్యూ సదస్సుల నిర్వహణ పక్కా ప్రణాళికతో, ఫలవంతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్*

తిరుపతి డిసెంబర్ 04:  ఈనెల 6 నుంచి వచ్చే నెల జనవరి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని రెవిన్యూ గ్రామాలలో సదస్సులు చక్కగా నిర్వహించాలని, ప్రజలకు సంబంధించిన అన్ని రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారం కొరకు ఈ వేదికను వినియోగించి సత్ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.

బుధవారం ఉదయం గౌ. రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ సంబంధిత కార్యదర్శి, సిసిఎల్ఎ కమిషనర్ తదితరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెవెన్యూ సదస్సుల నిర్వహణపై దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జెసి శుభం బన్సల్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల యొక్క రెవెన్యూ గ్రీవెన్స్ లను నాణ్యతగా పరిష్కరించి వాటిని జీరో స్థాయికి తీసుకురావడానికి రెవెన్యూ సదస్సులు ఒక వేదికగా వినియోగించుకోవాలని, రెవెన్యూ సంబంధిత సమస్యలతో తమ అర్జీల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను పదేపదే ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిప్పించుకోవద్దని సూచిస్తూ  దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ మార్గ నిర్దేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రికి కలెక్టర్ వివరించారు.

మంత్రి విసి అనంతరం అందరు ఆర్డీవోలు, అన్ని మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో కలెక్టర్  విసి నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 6వతేదీ నుండి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకూ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని  గ్రామాలలోని రెవెన్యూ సంబంధిత, భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశలో పకడ్బందీగా ప్రణాళికా బద్ధంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సదస్సుల సందర్భంగా సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శించి ఫ్రీహోల్డ్ మరియు సెక్షన్ 22A కు సంబంధించిన భూఆక్రమణ సమస్యలతో ప్రభావితమైన వారి నుండి వారికి ముందస్తు సమాచారంతో వినతులను స్వీకరించాలని అన్నారు. అందుకొరకు రెవెన్యూ డివిజన్, మండలాల వారీగా గ్రామ స్థాయిలో నిర్వహించే రెవెన్యూ సదస్సుల షెడ్యూలు తయారుచేసి ఫలవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్  గ్రీవెన్స్ లలో సుమారు 55 శాతం రెవెన్యూ సమస్యలు ఉంటున్నాయని వాటి పరిష్కారానికి ఈ రెవెన్యూ సదస్సులు వేదిక చక్కగా ఉపయోగపడుతుందని, జిల్లాలోని 1051 రెవెన్యూ గ్రామాలలో నిర్వహించాల్సి ఉంటుందని, సదరు రెవెన్యూ సదస్సుల నిర్వహణ కార్యక్రమానికి జెసి సమన్వయ కర్తగా ఉంటారని, ఆర్డీవోలు తమ పరిధిలోని మండలాలలో రెవెన్యూ సదస్సులను ఫలవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రెవెన్యూ సదస్సు నిర్వహించే రోజున వచ్చే అర్జీలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఉదాహరణకు సర్వే, అడంగల్, 1-B రికార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, మ్యుటేషన్, పేరు సవరణ  తదితర పత్రాలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ రోజు మినహా మిగిలిన రోజులలో వచ్చే అర్జీలకు నిర్దేశిత రుసుములు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సదస్సులో వచ్చే
పిటిషన్ల స్వీకరణ, పరిష్కార చర్యలు సకాలంలో తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగా స్వీకరించే ఫిర్యాదులన్నిటినీ రియల్ టైమ్ గవర్నెస్ సొసైటీ(RTGS) రూపొందించిన గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్లోని ప్రత్యేక విండోలో ఆన్‌లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందని  పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం,రెవెన్యూ సదస్సులు ప్రతి రోజు ఉదయం 9.00 గంటలకు రెవెన్యూ గ్రామంలో నిర్దేశించిన ప్రదేశంలో నిర్వహించాలని తెలిపారు. సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లను వారి వారి డివిజన్‌ల్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేసి  నేడు పంపాలని సూచించారు. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు తగు ప్రణాళికా, సదస్సు నిర్వహణకు తగినంత కూర్చోగలిగే సామర్థ్యం ఉన్న సరైన ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని చెప్పారు. రెవెన్యూ సదస్సుల గురించి ప్రజలకు తెలియ జేయడానికి స్థానిక మీడియాను, సోషల్ మీడియాను ఉపయోగించి విస్తృత అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశాల ఉద్దేశ్యం, సదస్సులు జరిగే తేదీలు,వేదిక వివరాలతో కూడిన కరపత్రాలు మరియు పోస్టర్లను అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. రెవెన్యూ సదస్సుల తేదీ మరియు స్థలాన్ని టాం-టాం ద్వారా గ్రామస్తులకు తెలియజేయాలని గ్రామ పంచాయతీ కార్యాలయం, పాఠశాల, గ్రామ సంస్థ కార్యాలయం, ఐకెపి,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రదర్శించాలని తెలిపారు.
తహసీల్దార్,రెవెన్యూఇన్స్పెక్టర్,సంబంధిత గ్రామాల వి.ఆర్.ఓ,మండల సర్వేయర్,రిజిస్ట్రేషన్ శాఖ ప్రతినిధి,అవసరమైన చోట్ల అటవీ,దేవాదాయ శాఖ,వక్ఫ్ బోర్డు సిబ్బందితో కూడిన ఈ అధికార బృందాలు ఆయా గ్రామాల సందర్శన గురించి గ్రామస్తులకు ముందస్తుగా తెలియజేసి విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులను మండల నోడల్ అధికారులుగా నియమించామని వారి ఆధ్వర్యంలో ఈరెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఎన్జీవోలు రైతు సహకార సంఘాలు తదితర అన్ని వర్గాల వారిని ఇందులో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. రెవెన్యూ సంబంధిత సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని సూచించారు భూ ఆక్రమణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని భూ ఆక్రమణ చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు పూర్తయ్యే నాటికి రీ సర్వే సంబంధిత సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదని, రీ సర్వే స్టోన్స్ పైన రాతలు పూర్తిగా చెరిపివేయాలని సూచించారు.

జేసి మాట్లాడుతూ రెవెన్యూ గ్రామ వారీగా చేపట్టనున్న సదస్సుల ప్రణాళికలు సక్రమంగా ఉండేలా రెవెన్యూ డివిజన్ అధికారులు సమన్వయం చేసుకోవాలని, సదస్సు సమయంలో పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ వివరాలు, కోర్టు కేసులకు సంబంధించి అంశాల రికార్డులు అందుబాటులో ఉంచుకోవాలని, బెస్ట్ ప్రాక్టీస్ డాక్యుమెంటేషన్ చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఎస్డిసి లు దేవేందర్ రెడ్డి వర్చువల్ గా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, రెవెన్యూ డివిజనల్ అధికారులు రామ్మోహన్ భాను ప్రకాష్ రెడ్డి కిరణ్మయి, కలెక్టరేట్ ఎ.ఓ భారతి, తదితర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


Leave a Comment