Advertisements

గంజాయి ఎగుమతులు, విక్రయాలపై ఉక్కుపాదం

గంజాయి ఎగుమతులు, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ‘ఈగల్‌’ చీఫ్‌ ఆకే రవికృష్ణ తెలిపారు. నరసరావుపేటలో ఎక్సైజ్‌ శాఖ అధికారులు 400 గంజాయి చాక్లెట్లు సీజ్‌ చేసిన నేపథ్యంలో ఆయన మంగళవారం పట్టణానికి వచ్చారు. పకడ్బందీ ఆపరేషన్‌తో గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులను అభినందించారు. రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ గంజాయి విక్రయాలు, వినియోగంపై 1972కు సమాచారం ఇస్తే, వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈగల్‌ విభాగానికి సమాచారం ఇవ్వడం ద్వారా.. గంజాయి, మాదకద్రవ్యాలను అరికట్టేందుకు సహకరించాలని రవికృష్ణ ప్రజలను కోరారు. గంజాయి చాక్లెట్ల తయారీపై వివరాలు తెలుసుకుంటామన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు సమాజాన్ని అంతర్గతంగా బలహీనపరుస్తాయన్నారు. వీటి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. గంజాయి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై ఎక్సైజ్‌, పోలీస్‌, ఈగల్‌ డిపార్టుమెంట్‌ అధికారులతో ఆకే రవికృష్ణ సమీక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ కె.శ్రీనివాసరావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మణికంఠ పాల్గొన్నారు. ఈగల్‌ ఛీప్‌గా నియమితులైన తర్వాత రవికృష్ణ తన తొలి పర్యటనను నరసరావుపేటలో చేపట్టారు.

Leave a Comment

You May Like This