Advertisements

విక్రాంత్‌, సాయిరెడ్డి, అరబిందో కంపెనీలపై సీఐడీ కేసు నమోదు

విక్రాంత్‌, సాయిరెడ్డి, అరబిందో కంపెనీలపై సీఐడీ కేసు నమోదు

కాకినాడ పోర్టు, సెజ్‌లలో వాటాలను లాక్కున్నారంటూ యాజమాని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు
పోర్టులో రూ.2,500 కోట్ల విలువైన వాటాకు రూ.494 కోట్లే ఇచ్చారని ఆరోపణ
సెజ్‌లో రూ.1,104 కోట్ల షేర్లకు రూ.12 కోట్లే ఇచ్చినట్టు వెల్లడి
విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్, అరబిందో కంపెనీపై కేసు నమోదు
నాటి సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెల్లడి
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మరో బెదిరింపుల వ్యవహారం వెలుగులో వచ్చింది. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్‌‌లలో తన వాటాలను బలవంతంగా, బెదిరించి లాక్కున్నారంటూ కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) సీఐడీకి ఫిర్యాదు చేశారు. పోర్టులో రూ.2500 కోట్ల విలువైన తన వాటాను రూ.494 కోట్లకు, సెజ్‌లో ఉన్న రూ.1109 కోట్ల విలువైన వాటాను కేవలం రూ.12 కోట్లకే లాక్కున్నారని సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదు అందించారు. దీంతో మంగళగిరి సీఐడీ అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు. ఐపీసీ 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్‌ విత్‌ 34 ఐపీసీ, భారతీయ న్యాయ సంహితలోని ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ బీఎన్‌ఎస్‌ 111 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కేవీ రావు ఫిర్యాదులో ఏముంది?

జగన్‌ మోహన్ రెడ్డి సీఎం అవ్వగానే తన కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బందులు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. చెన్నైకి చెందిన శ్రీధర్‌ అండ్‌ సంతానం కంపెనీ, ముంబైకి చెందిన మరో సంస్థతోనూ ఆడిట్‌ చేయిస్తున్నామంటూ సమాచారం ఇచ్చారని తెలిపారు. ఎంతో నిజాయతీగా నడుచుకున్నప్పటికీ.. ప్రభుత్వానికి రూ.994 కోట్లు ఎగ్గొట్టినట్లు వైసీపీ సర్కారుకు ఆడిట్ రిపోర్టు సమర్పించారని కేవీ రావు వెల్లడించారు. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి తమకు ఫోన్ చేసి జగన్‌ మోహన్ రెడ్డి బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌ రెడ్డిని కలవాలని చెప్పారని తెలిపారు. ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడగా.. ‘మీ కుటుంబం జైలుకు వెళ్లకూడదనుకుంటే కంపెనీ షేర్లన్నీ అమ్మేయండి’ అంటూ బెదిరించానని కేవీ రావు వాపోయారు. ఇది తన మాట కాదని, సీఎం జగన్‌ హుకుం అంటూ విక్రాంత్ రెడ్డి హెచ్చరించారని పేర్కొన్నారు.

దిక్కుతోచని పరిస్థితిలో కంపెనీ షేర్లు అమ్మడానికి ఒప్పుకున్నామని, 41.14 శాతంగా ఉన్న షేర్ విలువను కేవలం రూ.494 కోట్లుగా ఖరారు చేశామని, ఒప్పందం చేసుకోవాలంటూ హెచ్చరించారని కేవీ రావు తెలిపారు. ఒక్క ఏడాదిలోనే భారీ ఆదాయాన్ని సంపాదించే తమ కంపెనీ షేర్లకు ఇంత తక్కువ విలువ కట్టడం ఏమిటని ప్రశ్నించినా పట్టించుకోలేదని ఆయన వివరించారు. బెజవాడ బెంజ్‌ సర్కిల్‌లో స్థిరాస్తిని కూడా తక్కువ రేటుకు లాక్కున్నారని వివరించారు.

కాకినాడ సెజ్‌లో ఏం జరిగింది? అరబిందో కేసు ఏంటి?

కాకినాడ సెజ్‌ను 1999 నుంచి జీఎంఆర్‌తో కలిపి తాము అభివృద్ధి చేశామని కేవీ రావు తన ఫిర్యాదులో వెల్లడించారు. సెజ్‌లో 48.74శాతం తమ కుటుంబ వాటా కాగా, మిగిలింది జీఎంఆర్‌ వాటా అని వివరించారు. తమ వాటాగా 8 వేల ఎకరాల భూమి, పోర్టులో షేర్లు ఉన్నాయని, వైసీపీ సర్కారు బాధలు పడలేక సెజ్‌లో తమ భూమి, వాటాను రూ.400 కోట్లకు భాగస్వామి జీఎంఆర్‌కు అప్పగించాలనుకున్నామని తెలిపారు. వాస్తవానికి ఆ ఆస్తి విలువ రూ.1104 కోట్లే అయినప్పటికీ భాగస్వామి కావడంతో జీఎంఆర్‌‌కు వదిలేయాలనుకున్నామని, ఈ మేరకు అగ్రిమెంట్ కూడా కుదిరిందని పేర్కొన్నారు. అయితే ఈ డీల్‌ను రద్దు చేసుకొని భూమి మొత్తం తమకే అప్పగించాలంటూ అరబిందో యాజమాన్యం తమను బెదిరించిందని కేవీ రావు వివరించారు. భూమిని తమకు ఇవ్వకుంటే జైలుకు పోవాల్సి ఉంటుందని బెదిరించిందని పేర్కొన్నారు. రూ.12 కోట్లు మాత్రమే ఇచ్చి కాకినాడ సెజ్‌లో ఉన్న 48.74 శాతం తమ వాటాను లాక్కున్నారని వాపోయారు. తన కంపెనీ ఆదాయంలో 22 శాతం ప్రభుత్వానికి చెల్లించేలా ఒప్పందం ఉందని, అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ పట్టించుకోలేదు
తమకు జరిగిన అన్యాయంపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కేవీ రావు ఫిర్యాదులో కేవీ రావు వాపోయారు. తాడేపల్లిలోని జగన్‌ ప్యాలెస్‌కు విక్రాంత్ రెడ్డి తనను తీసుకెళ్లారని, పెద్దమనసుతో వేల కోట్ల వాటాను రూ.12 కోట్లకే ఇచ్చారంటూ జగన్‌కు విక్రాంత్ చెప్పారని వెల్లడించారు. అన్యాయం జరగబోతోందని చెప్పబోతుండగానే విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు వినాలని జగన్ అన్నారని వివరించారు.

Leave a Comment