ఇక నుంచి నిఘా నీడలో కాకినాడ పోర్టు.. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా భద్రత?
అధికారుల సహకారం వల్లే గ్రామీణ స్థాయి నుంచి పోర్టు వరకు బియ్యం సరఫరా జరుగుతుందని ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ఆయన ఒకే ఒక్క పర్యటనతో రేషన్ బియ్యం మాఫియా షేక్ అయిపోతోంది. సీజ్ ది షిప్ ట్రెండింగ్ టాపిక్ అయింది. చంద్రబాబుతో పవన్ భేటీ..తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు చర్చలతో..కాకినాడ పోర్టుపై నిఘా పటిష్టం చేయబోతున్నారు.
ఓ సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో స్పెషల్ సెక్యూరిటీ టీమ్‌ను పెట్టి.. అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా పోలీస్ కనుసన్నుల్లోనే జరిగేలా పావులు కదుపుతోందట. షిప్ సీజ్.. అధికారుల వైఫల్యం..ఈ హడావుడి కంటే పోర్టు మీదే ఓ కన్నేసి పెడితే..అందరి లెక్కలు తేలుతాయని భావిస్తున్నారట. ప్రత్యేక భద్రతా అధికారి పర్యవేక్షణలో నిఘా పెడితే..కాకినాడ పోర్టులో జరుగుతోన్న దందా అంతా బయటికి వస్తోందని అనుకుంటుంటోందట.
ప్రత్యేక భద్రతా వ్యవస్థ..డేడికేటెడ్గా పోర్టులోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. లోకల్ పోలీస్‌లు వెళ్లి పర్యవేక్షణ పెట్టడం కంటే.. ఓ స్పెషల్ టీమ్ 24 హవర్స్ పోర్టులోనే విధులు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. అలా పోర్టులో ఏం జరిగిన వెంట వెంటనే తెలిసిపోయేలా.. ప్రతీ అక్రమ దందాకు అక్కడే చెక్ పెట్టేలా పకడ్బందీ వ్యూహం రెడీ చేస్తున్నారట.
అధికారులతో టీమ్ ఏర్పాటు!
ఇప్పటికే బియ్యం లోడ్‌తో పట్టుబడిన షిప్ సీజ్ తమ అధీనంలోనే ఉందని కలెక్టర్ షన్మోహన్ ప్రకటించారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై..పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీమ్ ఏర్పాటు చేసి..రెండు రోజులు ప్రత్యేక టీమ్‌లతో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ఎక్కడెక్కడి నుంచి బియ్యం పోర్టుకు చేరుతున్నాయో..లింకులు ఏంటో బయటికి తీసేందుకు రెడీ అవుతున్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపే విషయంలో తగ్గేదేలే అంటోంది ఏపీ సర్కార్. కాకినాడ పోర్టులో భద్రతను పటిష్టం చేయాలని డిసైడ్ చేసింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో వ్యవహారాలపై మంత్రులు జరిపిన సమీక్షలో కీలక విషయాలు తెలిశాయట. కిందిస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు చాలామంది రైస్ మాఫియాకు సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
అధికారుల సహకారం వల్లే గ్రామీణ స్థాయి నుంచి పోర్టు వరకు బియ్యం సరఫరా జరుగుతుందని ఆరా తీసినట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం విదేశీ ఎగుమతులకు అడ్డాగా తయారైన కాకినాడ పోర్టులోనే..బియ్యం రీసైక్లింగ్ కూడా జరుగుతుందట. పోర్టులోని గోదాములను లీజుకు తీసుకుని రేషన్ బియ్యాన్ని నూకలు చేయడం, పాలిష్ పట్టి సిల్కీ రైస్‌గా మార్చడానికి యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారట. దీంతో పోర్టుపై పోలీస్ నిఘాను ఇంకా పటిష్టం చేసి..బియ్యం అక్రమ రవానా జరిగే ఏరియాల్లో అనుభవమున్న అధికారులను నియమించి..ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
కాకినాడ పోర్టు భద్రతలో భాగంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ CSOను నియమిస్తారట. ఆయన ఆధ్వర్యంలోనే పోర్టు పరిసర ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేయనున్నారు. షిఫ్టుల వారిగా అధికారులు..అవసరమైతే సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోర్టును తమ అధీనంలోకి తీసుకుంటే రేషన్ బియ్యం మాఫియాను చావు దెబ్బ కొట్టొచ్చని భావిస్తున్నారు. అలా విదేశాలకు బియ్యం ఎగుమతికి అడ్డాగా ఉన్న కాకినాడ పోర్టునే పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంటే రైస్ మాఫియా ఆగడాలను అడ్డుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారట.
కాకినాడ పోర్టు పరిశీలనలో భాగంగా సీజ్ ది షిప్ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్‌గా మారాయి. అయితే పవన్ చెప్పినంత ఈజీగా షిప్‌ను సీజ్ చేయడం సాధ్యం కాదని, అంతర్జాతీయంగా ఈ ప్రభావం ఉంటుందన్న చర్చ జరిగింది. అయితే షిప్‌ను ఆపే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చే వరకే పవన్ కామెంట్ మీద రాజకీయ రచ్చ కంటిన్యూ అయింది. పవన్ టూర్ మీద వైసీపీ సెటైర్లు వేస్తోంది. రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలుతున్నది నిజమని.. దాన్ని అరికట్టడంలో విఫలమైనట్లు ఒప్పుకున్నారని విమర్శిస్తోంది. రేషన్ బియ్యం తరలింపు జాతీయస్థాయి కుంభకోణమంటున్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
సీజ్ ది షిప్ అంటూ పవన్ చేసిన కామెంట్స్ నుంచి స్పెషల్ సెక్యూరిటీ టీమ్ ఏర్పాటు వరకు కాకినాడ పోర్టుపై అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఫైనల్‌గా గ్రామీణ స్థాయి నుంచే రేషన్ బియ్యం దందాకు చెక్ పెట్టడంతో పాటు..పోర్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని కూటమి సర్కార్ డిసైడ్ అయిందట. ద్విముఖ వ్యూహంతో రేషన్ రైస్ స్మగ్లింగ్‌కు ఎండ్ కార్డ్ వేయాలని ఫిక్స్ అయిందంటున్నారు.
అంతర్జాతీయంగా ఈ ప్రభావం?
త్వరలోనే మరిన్ని చర్యలు ఉంటాయని.. తన, మన అని తేడా లేకుండా..రేషన్ బియ్యం మాఫియా విషయంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్‌గా ఉన్నారని అంటున్నారు కూటమి నేతలు. వైసీపీ విమర్శలు తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం తప్ప వాస్తవాలను మాత్రం ఒప్పుకోవడం లేదని రివర్స్ అటాక్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ వ్యవహరం పొలిటికల్‌గా ఇంక ఎంత వరకు వెళ్తుందో.