Advertisements

ములుగు ఎన్‌కౌంటర్‌ కేసు.. హైకోర్టు ఏం చెప్పిందంటే

ములుగు ఎన్‌కౌంటర్‌ కేసు.. హైకోర్టు ఏం చెప్పిందంటే

హైదరాబాద్, డిసెంబర్ 3: ములుగు ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ములుగు ఎన్‌కౌంటర్ తదుపరి చర్యలు, పోస్టుమార్టం రిపోర్టును అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌పై ఈరోజు (మంగళవారం) విచారణ జరిపిన న్యాయస్థానం మల్లయ్య మృతేదహాన్ని గురువారం వరకు భద్రపరచాలని ఆదేశించింది. మిగిలిన మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించాలని చెప్పింది. తదుపరి విచారణను గురువారం (డిసెంబర్ 5)కు వాయిదా వేసింది.

నిన్నటి విచారణలో ఈరోజు వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. నేడు మరోసారి పిటిషనర్ తరపున, అలాగే ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగాయి. అయితే మృతదేహాలపైన అనేక గాయాలు ఉన్నాయని, ఇదొక బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. భద్రపరిచిన మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని పదే పదే కోరారు. మరోవైపు నిన్న హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సమయంలో పోస్టుమార్టం అంతా కూడా చీకటిలో నిర్వహించారని, పంచనామా ప్రక్రియ సరిగ్గా నిర్వహించలేదు కాబట్టి రీపోస్టుమార్టం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.

అలాగే ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా తన వాదనలు వినిపిస్తూ.. ఎన్‌హెచ్‌ఆర్సీ గైడ్‌లెన్స్‌ ప్రకారం, అలాగే హైకోర్టు ఆదేశాల మేరకే శవ పరీక్షలు పూర్తి చేశామని స్పష్టం చేశారు. కేవలం ఎదురుకాల్పుల్లో మాత్రమే మావోలు మృతిచెందారని ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఎక్కడా కూడా ఇది బూటకపు ఎన్‌కౌంటర్ కాదని, ఆహారంలో ఎలాంటి విషం ఇవ్వలేదని న్యాయవాది స్పష్టం చేశారు. ఎనిమిది మంది వైద్య నిపుణులతో పోస్టుమార్టం పూర్తి చేశామని వాటికి సంబంధించి ఫోటోగ్రఫీ కూడా కోర్టుకు అందజేస్తున్నామని ప్రభుత్వం తరుపున న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. మృతదేహాలను భద్రపరిచనట్లైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని.. అందుకే మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు.

అయితే మావోలకు భోజనంలో విషం కలిపారని, ఆపై కస్టడీలోకి తీసుకుని కాల్చిచంపారన్న అంశాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. పీఎంఈ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో వాదనలు వినిపించాలని హైకోర్టు చెప్పింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కేవలం మల్లయ్య మృతదేహం తప్ప మిగిలిన మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీఎంఈ రిపోర్టుతో పాటు ఎన్‌కౌంటర్ జరిగిన పరిణామాలకు సంబంధించిన రిపోర్టు, ఎన్‌కౌంటర్ తదుపరి చర్యలను న్యాయస్థానానికి అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. గురువారం రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను ఇచ్చిన తరువాత తదుపరి చర్యలకు హైకోర్టు ఆదేశించే అవకాశం ఉంది. కేవలం పిటిషనర్‌గా మల్లయ్య భార్య ఉన్నందున.. ఆయన మృతదేహాన్ని తప్ప మిగిలిన మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..

Leave a Comment

You May Like This