సెలవురోజుల్లో తరగతుల నిర్వహణ దారుణం
శ్రీచైతన్య స్కూల్ ఎదుట ఏఒఎస్ఎఫ్ నిరసన
140 మంది విద్యార్థులను ఇళ్లకు పంపివేత
గూడూరు న్యూస్ (విస్డం వార్త)
సెలవుల్లోనూ తరగతుల నిర్వహణపై గూడూరు శ్రీచైతన్య స్కూల్ ఎదుట ఆదివారం ఎఐఎస్ఎఫ్ నాయకులు నిరసన తెలిపారు. స్కూల్లో 140 మంది పదవ తరగతి విద్యార్థులు ఆదివారం కూడా పరీక్షలు రాస్తుండగా గమనించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించి విద్యార్థులను ఇళ్లకు పంపివేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీ. శశి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులను సెలవు రోజుల్లోనూ స్కూళ్లకు పిలిపించి వారిని మానసిక ఒత్తిడికి గురిచేయడం సరికాదన్నారు. ప్రయివేటు పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లు విద్యార్థులను మార్కులు సాధించే యంత్రాలుగా పరిగణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి కుమార్, సభ్యులు సతీష్, దీపు,
సుజిత్, శశి, మధు, సుమన్, చరణ్, సిరాజ్, లోకేష్, అఖిరానంద్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.