పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల రుణం మంజూరు చేయాలి
నవంబర్ 18న గ్రామ సచివాలయాల వద్ద ఆందోళన
సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి వెల్లడి
ప్రస్తుత కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆ ఇళ్ళ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తానని ఇచ్చిన హామీని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి డిమాండ్ చేశారు. శనివారం గూడూరు సీపీఐ నియోజకవర్గ కౌన్సిల్ సమావేశం ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు షేక్ కాలేషా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య పెద్ద తేడా ఏమీ కనిపించదన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, ఇసుక, ఇనుము, ఇటుక, కంకర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలన్నారు. ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు జరపాలన్నారు. అందరికీ ఇసుక అందుబాటులో ఉండే విధంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన లేఔట్లను మార్పు చేసి గ్రామీణ పేదలకు మూడు సెంట్లు పట్టణ పేదలకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు. అవసరమైన రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ పారుదల వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. వీటన్నిటి సాధన కోసం సీపీఐ పెద్ద ఎత్తున లబ్ధిదారులను గుర్తించి పోరాటానికి సిద్ధం చేయాలన్నారు. అలాగే టిట్కో ఇళ్ల లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను కూడా పూర్తి చేసి సత్వరమే ప్రతి లబ్ధిదారునికి ఇల్లు అందేలా చూడాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఓ పక్క చంద్రబాబు కాదంటూనే మరోపక్క వాళ్ళ ఎంపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కనుక కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తే దానికి అనుకూలంగా ఉండాల్సిందేనని అన్నారని, ఈ విషయంపై చంద్రబాబు మోడీని నిలదీసే పరిస్థితిలో లేడని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పాలసీ మొత్తం వట్టి అబద్ధాలేనన్నారు. ఒకటో రెండో పథకాలు అమలు చేస్తూ నేను అన్నీ చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు. గత ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేది కానీ నేడు రైతులకు ఎలాంటి భరోసా లేకుండా పోతోందన్నారు. ఎన్నికలకు ముందు బాదుడే బాదుడు అన్న చంద్రబాబు ఇప్పుడు ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో బాహాబాయిగా కొట్టుకోవడానికి బీజేపీ ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతుందన్నారు. మతోన్మాద బీజేపీ ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఏర్పడబోతుందన్నారు. అదేవిధంగా సీపీఐ 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలను డిసెంబర్ 25 నుండి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోబోతున్నామన్నారు. మన జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం మన పార్టీకి ఉందన్నారు. ఆ దిశగా సిపిఐ 100 ఏళ్ల ఉత్సవాలను జరిపే క్రమంలో ప్రజల్ని మరింత చైతన్య పరిచే పద్ధతులలో మన ఉద్యమాలు కొనసాగాలని ఆయన సూచించారు. అలాగే నవంబర్ 18న ప్రతి నియోజకవర్గంలోని అన్ని సచివాలయాలలో పేదలను సమీకరించి ఇళ్ల స్థలాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే రైతు ఆందోళనలో గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులను పెద్ద సంఖ్యలో కదిలించాలన్నారు. అందుకు అన్ని ప్రజా సంఘాలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని సూచించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పీ. మురళి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్. ప్రభాకర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కత్తి రవి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, పట్టణ కార్యదర్శి షేక్. కాలేషా, చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఎంబేటి చంద్రయ్య, కె. నారాయణ, వ్య.కా.స. నియోజకవర్గ కార్యదర్శి ఎన్. శ్రీనివాసమూర్తి, ఇన్సాన్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా, సీపీఐ సమితి సభ్యులు సీతా భాస్కర్, సుబ్రమణ్యం, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు అంకయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు యాకోబు, శేషయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.