Advertisements

రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలి

రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్

సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సచివాలయ కార్యదర్శికి వినతి

గూడూరు :

సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సోమవారం సచివాలయ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు రూ. 20 వేలు పెట్టుబడిసాయం అందిస్తామని ప్రకటించారన్నారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై సుమారు 2 లక్షల 45 వేల రూపాయల రుణం ఉందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాయలసీమ జిల్లాల్లో కరువు పరిస్థితి, మరో వైపు కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఖరీఫ్ సీజన్లో సుమారు 12 లక్షల ఎకరాల్లో రైతాంగం పంటలు వేయలేకపోయారన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగిసిందన్నారు. రబీ సీజన్ ప్రారంభమై రైతులు పెట్టుబడికోసం ఎదురుచూస్తున్న దశలో ప్రభుత్వం ప్రకటించిన రైతుకు 20 వేల రూపాయల పెట్టుబడిసాయం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గత ఐదేళ్లుగా అటకెక్కిందన్నారు. ఈ దశలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయన్నారు. అలాగే వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు రాబోయే బడ్జెట్లో కేటాయించిసాగునీటి రంగ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 40వేలకు పైగా ఉన్న చెరువుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధికంగా 21 వేలకు పైగా ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లుగా చెరువులు అక్రమణలకు గురై కనీస మరమ్మత్తులకు నోచుకోలేదన్నారు. చెరవుల పునరుజ్జీవనానికి దృష్టిసారించాలన్నారు. 32 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలు, ప్రజాప్రతినిధుల రాజీనామాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా నిలువరించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఉక్కుతోపాటు రైతులకు అవసరమైన పుష్కర యూరియా (అమ్మోనియంసల్ఫేట్) క్రూడ్ ఆయిల్, కోలితారవాష్ ఆయిల్, గ్యాస్, ఆంధ్రాసీన్ ఆయిల్, హెవీ క్రూడ్ బెంజాల్ తదితర 20 ఉత్పత్తులను ఉక్కు ఫ్యాక్టరీ అందిస్తూ దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతోందన్నారు. అటువంటి ప్రయోజనకర ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని వ్యతిరేకించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్. రాజశేఖర్ రెడ్డి సమయంలో పలు జిల్లాల్లో సెజ్ ల పేరుతో పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం రైతుల నుండి సేకరించిన భూములు చాలా వరకు వినియోగించలేదన్నారు. ఆ భూములను తిరిగి రైతాంగానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత రబీ సీజన్లో రైతాంగం సాగు చేస్తున్న పంటలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం పంటల భీమా సొమ్ము ప్రభుత్వమే భరించి రైతాంగాన్ని అదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, సీపీఐ నాయకులు జీ. శశి కుమార్, షేక్ కాలేషా, ఎంబేటి చంద్రయ్య, అంకయ్య, మస్తానయ్య, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This