జర్నలిస్టులకు గుర్తింపు కార్డుల నిరాకరణ చెల్లదు..
అక్రిడిటేషన్ రూల్స్‌లో కొంతభాగాన్ని కొట్టిసిన హైకోర్టు..
చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ (ప్రభుత్వ గుర్తింపు కార్డు) ఇవ్వకుండా దూరం పెట్టడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ – 2016లోని షెడ్యూల్ ‘ఈ’ ని కొట్టేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. చిన్న వార్తాపత్రికలను నాలుగు విభాగాలుగా విభజించడం చెల్లదని పేర్కొంది. 2016లో జీవో 239 ద్వారా అప్పటి ప్రభుత్వం పెట్టిన నిబంధనలను సవాల్ చేస్తూ మహబూబ్‌నగర్‌కు చెందిన తాటికొండ కృష్ణ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ‘చిన్నపత్రికల్లో పనిచేసే జర్నలిస్టులను ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా ఎందుకు విభజించారో సరైన వివరణ లేదు. తగిన వివరణ, సమర్థన లేకుండా మిగతావారితో సమానంగా గుర్తింపు కార్డులు ఇ్వకపోవడం చెల్లదు. రెండు నెలల్లో పారదర్శక, హేతుబద్ధమైన ప్రాతిపదికన మార్గదర్శకాలు రూపొందించాలి’ అని ఆదేశించింది..