రాష్ట్ర ఇంటిలిజెన్స్ చీఫ్‌గా మహేష్‌చంద్ర లడ్హాను ప్రభుత్వం నియమించింది.
సీఎం చంద్రబాబును మహేష్‌చంద్ర లడ్హా మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర ఇంటిలిజెన్స్ చీఫ్‌గా మహేష్‌చంద్ర లడ్హాను ప్రభుత్వం నియమించింది. ఈ తరుణంలో సచివాలయంలో సీఎం చంద్రబాబును మహేష్‌చంద్ర లడ్హా మర్యాదపూర్వకంగా కలిశారు.
నక్సల్ ఆపరేషన్స్‌లో కీలకం వ్యవహారించిన లడ్హా1998 బ్యాచ్‌కి చెందిన మహేష్‌చంద్ర లడ్హాకు శిక్షణ తర్వాత మొదటి పోస్టింగ్‌ను, మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన అప్పటి విశాఖ జిల్లా చింతపల్లిలో ఇచ్చారు. నక్సల్ సమస్యలు తీవ్రంగా ఉన్న సమయంలో ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం మహబూబ్‌నగర్‌లో ఓఎస్డీగా పనిచేసిన లడ్హా కీలక నక్సల్ ఆపరేషన్స్ నిర్వహించారు. 2004లో ఎస్పీగా ప్రకాశం జిల్లాలో ఆయనకు తొలి పోస్టింగ్ ఇచ్చారు.గుత్తికొండ సహా ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామస్తులకు మహేష్‌చంద్ర లడ్హా అవగాహన కల్పిస్తూనే, పలు ఆపరేషన్లు చేపట్టారు. నక్సల్స్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని నిర్ణయించినపుడు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయన కీలకంగా వ్యవహరించారు. 2005లో నక్సల్స్ ఆయణ్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పథకం వేశారు. ఒంగోలు రహదారిపై వెళ్తుండగా సైకిల్ బాంబును పేల్చగా లడ్హా త్రుటిలో తప్పించుకున్నారు.అనంతరం నిజామాబాద్ ఎస్పీగా మహేష్‌చంద్ర లడ్హా బదిలీ అయ్యారు. రేండేళ్ల తర్వాత గ్రేహౌండ్స్‌లో పనిచేశారు. 2009లో గుంటూరు ఎస్పీగా పనిచేసిన ఆయన అక్కడ రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు. గురజాల, పిడుగురాళ్లలో ఫ్యాక్షనిజంపై చర్యలు తీసుకున్నారు. 2009 ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లాలో రీపోలింగ్ జరగకుండా, గొడవలు చెలరేగకుండా చర్యలు తీసుకున్నారు. మొదటిసారి ఎలాంటి ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నందుకుగానూ ఎన్నికల కమిషన్ ఆయణ్ని అభినందించింది.
హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేసిన తర్వాత మహేష్‌చంద్ర లడ్హా, కేంద్ర సర్వీసులకు వెళ్లి ఎన్ఐఏలో పనిచేశారు. మక్కా మసీదు పేలుళ్ల కేసు దర్యాప్తు సహా పలు ఉగ్రవాద కార్యకలాపాల కేసులు, హై ప్రొఫైల్ కేసులను దర్యాప్తు చేశారు. అనంతరం సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీగా పనిచేశారు. అనంతరం విజయవాడ జాయంట్ సీపీగా విధులు నిర్వర్తించారు. కాల్ మనీ వ్యవహారంలోనూ ఆయన దర్యాప్తు చేశారు.
విశాఖలో రౌడీలపై ఉక్కుపాదం
2018లో విశాఖ కమిషనర్‌గా పనిచేసిన మహేష్‌చంద్ర లడ్హా, అదే సమయంలో జగన్‌పై కోడికత్తితో దాడి జరిగిన వ్యవహారంలో పారదర్శకంగా దర్యాప్తు జరిపించారు. విశాఖలో రౌడీలపై ఉక్కుపాదం మోపారు. ఆయన చర్యలకు చాలా మంది రౌడీలు విశాఖ వదిలి వెళ్లిపోయారు. చెడ్డీ గ్యాంగ్‌ల భరతం పట్టారు. ఐపీఎస్ అధికారి లడ్హా తాను పనిచేసిన ప్రతి విభాగంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సీఆర్పీఎఫ్లో విశిష్ట సేవలకుగాను ఈ ఏడాది ప్రెసిడెంట్ మెడల్ పురస్కారం దక్కింది. 2018లో విశాఖ సీపీగా పనిచేస్తున్న సమయంలోనూ ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. చేపట్టిన ప్రతీ పోస్టింగ్‌లోనూ సమర్థతతో వ్యవహరించిన మహేష్‌చంద్ర లడ్హా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గానూ కీలక భూమిక పోషించనున్నారు.