Advertisements

సేవకు గుర్తింపు
ప్రశంసతో మరింత బాధ్యత


గూడూరు : సేవకు గుర్తింపు ప్రసంశాపత్రమని ది యంగ్ గూడూర్ షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్. జమాలుల్లా అన్నారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్రీడలతోపాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వైజీఎస్బీఏ కు ప్రశంసాపత్రాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సేవకు తగిన గుర్తింపు లభించిందన్నారు. 2011లో ది యంగ్ గూడూర్ అసోసియేషన్ ను స్థాపించామన్నారు. అప్పటినుండి క్రమం తప్పకుండా గూడూరు లాంటి చిన్న పట్టణంలో జాతీయ స్థాయి షటిల్ బాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ప్రతి సంవత్సరం షటిల్ ఉచిత శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతోమంది క్రీడాకారులను తీర్చిదిద్దామన్నారు. ఓ వైపు క్రీడలను ప్రోత్సహిస్తూనే మరోవైపు అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామన్నారు. కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వయంగా అసోసియేషన్ సభ్యులు కూడా కరోనా బారిన పడిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే ప్రముఖ వస్త్ర వ్యాపారి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాధంశెట్టి గిరిబాబు రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సొంత నిధులతో కొనుగోలుచేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాధంశెట్టి గిరిబాబు మాట్లాడుతూ వైజీఎస్బీఏ కు ప్రశంసా పత్రంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. క్రీడా పోటీలతోపాటు సేవా కార్యక్రమాలను మరింత నిర్వహిస్తామన్నారు. వైజీఎస్బీఏ తరపున శిక్షణ పొందిన 30మందికి పైగా క్రీడాకారులు షటిల్ బాడ్మింటన్ కోచ్ లుగా దేశ విదేశాలలో స్థిరపడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైజీఎస్బీఏ ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ కలామ్ మాట్లాడుతూ వైజీఎస్బీఏలో శిక్షణ పొందిన గౌస్, బషీర్ జాతీయ స్థాయిలో రాణించడం గూడూరుకే గర్వకారణమన్నారు. ప్రశంసాపత్రాన్ని అందించిన ఆర్డీఓ కిరణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు, డీఎస్పీ ఎం. సూర్యనారాయణ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైజీఎస్బీఏ సభ్యులు షేక్. జమాలుల్లా, జీ. గిరిబాబు, షేక్. కలామ్, కోదండపాణి, మల్లికార్జున్, ఇంతియాజ్, మురళీ, ఉదయ్, ఇలియాజ్ పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This